మాండూస్ తుఫాన్ రైతులను నట్టెట ముంచింది. చేతికొచ్చని పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలపై రివ్యూ చేసిన సీఎం పంట నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. ఇదిలాఉంటే.. రాగల మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే మాండూస్ తుఫాను ఏపీలో బీభత్సం సృష్టించింది. మాండూస్ దెబ్బతో రైతాంగం విలవిలలాడుతోంది. తుపాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. చేతికి దిగుబడి వచ్చే సమయంలో మాండూస్ తుపాను గద్దలా ఎత్తుకుపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రైతన్న తీవ్రంగా నష్టపోయారు. వరి, పచ్చ జొన్న, మిరప, మినుము, శనగ పంటలు తుపాన్ దెబ్బకు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోవెలకుంట్ల మండలంలో 2280 ఎకరాల్లో.. సంజామల మండలంలోనే 3750 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు గుర్తించారు. అటు ప్రకాశం జిల్లా లో సేమ్ సిచువేషన్. మార్కాపురం, పెద్దారవీడు, తర్లుపాడు మండలాల్లో మిరప పంట నేలకొరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. కోడుమూరులో మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం జరిగింది. వర్షాలపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలవారీగా పరిస్థితులను అడిగితెలుసుకున్నారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.
మోగా గండం..
మాండూస్ తగ్గగానే మోత మోగించడానికి మోగా సిద్ధమవుతోంది. రెండు రోజుల్లో మోగా తుపాను విరుచుకుపడుతుందని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. మరోవైపు తెలంగాణలోను మాండూస్ ఎఫెక్ట్ కనిపించింది. గత రెండురోజులుగా హైదరాబాద్ పరిసన ప్రాంతాల్లో వర్షం కురిసింది. శంషాబాద్ తోపాటు నగరంలోని పలు ఏరియాల్లో వర్షం ఎఫెక్ట్ కనిపించింది. రాగల మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతుందని హెచ్చరిక జారీ చేసింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..