Tripurantakeswara temple: బయటపడిన త్రిపురాంతకేశ్వర ఆలయ రహస్యాలు.. 14వ శతాబ్దం నాటి శాసనం

| Edited By: Velpula Bharath Rao

Oct 03, 2024 | 1:42 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో 14వ శతాబ్దం నాటి మరో శాసనం వెలుగు చూసింది. ఆలయ ప్రాంగణంలోని నంది పక్కనే ఉన్న ఓ స్తంభంపై ఈ శాసనం చెక్కి ఉన్నట్టు గుర్తించారు.

Tripurantakeswara temple: బయటపడిన త్రిపురాంతకేశ్వర ఆలయ రహస్యాలు.. 14వ శతాబ్దం నాటి శాసనం
Sri Tripurantakeswaraswamy.
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో 14వ శతాబ్దం నాటి మరో శాసనం వెలుగు చూసింది. ఆలయ ప్రాంగణంలోని నంది పక్కనే ఉన్న ఓ స్తంభంపై ఈ శాసనం చెక్కి ఉన్నట్టు గుర్తించారు. 14వ శతాబ్దంలో వీరశైవులుగా ఉన్న భిక్షవృత్తి అయ్యంగార్లు చేయించిన బంగారు ఆభరణాల వివరాలు తెలుపుతూ ఈ స్థంభంపై శాసనం లిఖించారు. ఆ కాలంలో వీరశైవులు భిక్షాటన వృత్తిగా చేసుకుని, అలా సేకరించిన ధనంతో దేవాలయ నిర్వహణ చేసేవారు.

అయ్యంగార్లకు భూములు, సంపదలు ఉన్నా భిక్షాటన చేయడం ద్వారా వచ్చిన ఆదాయంతో ఆలయాల పునరుద్ధరణ, నిర్వహణ చేసేవారు. అలా 14వ శతాబ్దంలో త్రిపురాంతకేశ్వరాలయం భిక్షవృత్తి అయ్యంగార్ల ఆధీనంలో ఉందన్న వివరాలను ఈ శాసనం తెలియచేస్తోంది. తాజాగా ఈ శాసనాన్ని చారిత్రక పరిశోధకులు తురిమెళ్ళ శ్రీనివాసప్రసాద్‌ గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని ఇదే త్రిపురాంతకేశ్వరస్వామి దేవాలయంలో గతంలో బ్రహ్మీ శాసనం వెలుగులోకి వచ్చింది. ఇది ప్రాకృత భాషలో 2వ శతాబ్దపు నాటి బ్రాహ్మీ అక్షరాలలో లిఖించబడింది.

శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విలసిల్లుతున్న త్రిపురాంతకం క్షేత్రం శైవ, శాక్తేయ ఆలయాల్లో అతి పురాతనమైంది. ఇక్కడ వేద విశ్వవిద్యాలయం నడిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.  శ్రీచక్ర ఆకారంలో శక్తి పీఠాల ఆలయాలను నిర్మిస్తుండటం ఆనవాయితీ కాగా త్రిపురాంతకేశ్వరుని ఆలయం శ్రీచక్ర పీఠంపై నిర్మితం కావడంతో ఈ ఆలయానికి ప్రత్యేక విశిష్టత సమకూరింది… ఈ ఆలయం శ్రీశైల ఆలయం కంటే అతి పురాతనమైందిగా చెబుతారు… 7వ శతాబ్ధంలోని కాకతీయుల కాలంలో నిర్మాణం జరిగిన అతి ప్రాచీన ఆలయం త్రిపురాంతక క్షేత్రంగా చెబుతారు. ఆలయానికి వేసిన రంగులను ఇటీవల తొలగించడంతో శిల్ప సంపదతో పాటు గోడలపై శాసనాలు వెలుగులోకి వస్తున్నాయి.