
ఏపీ రాజకీయాల్లో జంతుబలుల రచ్చ మొదలైంది. వైసీపీ అధినేత జగన్ బర్త్‌డే నాడు వైసీపీ శ్రేణులు జంతుబలులు చేపట్టిన తీరుపై టీడీపీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. ఇలాంటి వాటికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హోంమంత్రి హెచ్చరించారు. అయితే దీన్ని కూడా రాజకీయం చేయడం ఏంటని వైసీపీ కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమే అని ఆరోపించింది.
జగన్ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నేతలు జంతుబలులు చేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నేర ఆలోచనలను పార్టీ శ్రేణులు కూడా అనుసరించేలా జగన్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలు పాల్పడిన వారికి చట్టప్రకారం శిక్ష తప్పదన్నారు. హోంమంత్రి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడ్డారు. జగన్ పుట్టినరోజు వైసీపీ శ్రేణులు చేసిన జంతుబలులను టీడీపీ తప్పుబట్టడం సరికాదని అన్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా టీడీపీ శ్రేణులు కూడా జంతుబలులు చేపట్టాయని.. గతంలో బాలకృష్ణ సినిమా రిలీజ్‌కు మేకతలలు వేలాడదీశారని కౌంటర్ ఇచ్చారు. వీటిపై హోంమంత్రి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే వైసీపీపై నిందలు వేస్తున్నారని మాజీమంత్రి కన్నబాబు ఆరోపించారు. కూటమి చేసిన పాపాలకు రాజధాని రైతు బలయ్యాడని అన్నారు. ఎదుటివారిపై బురద జల్లడం టీడీపీకి అలవాటే అని విమర్శించారు. మొత్తానికి జగన్ పుట్టినరోజున వైసీపీ శ్రేణులు చేసిన జంతుబలుల వ్యవహారం ఇప్పుడు అధికార, విపక్షాల మధ్య ఇది రాజకీయ రగడకు కారణమైంది. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా కేసులు పెడతామని ప్రభుత్వం చెబుతుంటే.. ఇదే రకంగా వ్యవహరించిన మీ పార్టీ శ్రేణుల సంగతేంటని వైసీపీ ప్రశ్నిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..