Ambati Rambabu: గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పారు. తన సొంత కాపు కులంపై చేసిన కామెంట్స్ తీవ్ర వివాదస్పదమైన నేపథ్యంలో ఆయన స్పందించారు. కాపులపై చేసిన వ్యాఖ్యల వల్ల తన కులస్తులు మనస్తాపానికి గురైనట్లు తెలిసిందని, కాపుల సోదరులకు భేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు అంబటి రాంబాబు శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. అందరికీ నమస్కారం.. నేను మీ అంబటి రాంబాబును మాట్లాడుతున్నాను.. నేను ఈ మధ్య కాలంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. కులం పట్ల నేను చేసిన వ్యాఖ్యలు నా కులపు సోదరులను బాధించినట్లుగా అర్థమైంది. ఆ సమయంలో నేను అలా అని ఉండకూడని తర్వాత నేను పశ్చాత్తాపపడ్డాను. బాధపడిన నా కుల సోదరులందిరీకి నా హృదయపూర్వకంగా, భేషరతుగా క్షమాపణలు కోరుతున్నాను.. అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అంబటి రాంబాబు కాపు సామాజికవర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాపులు తెలివి తక్కువవాళ్లు, ఆవేశపరులు, మాంసం ఎక్కువగా తింటారు, మద్యం బాగా తాగుతారు. ఇవన్నీ మిగతా కమ్యూనిటీల్లో ఉన్నా.. కాపుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.. అని అంబటి రాంబాబు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరేమైనా సర్వే చేశారా అని ఇంటర్వ్యూలో యాంకర్ అడుగగా, దీనికి సర్వే అవసరం లేదు. కాపులు తెలివి తక్కువవాళ్లే అంటూ వ్యాఖ్యాలు చేశారు. దీనిపై తన కులస్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రాంబాబు క్షమాపణ చెప్పారు.
— Ambati Rambabu (@AmbatiRambabu) June 26, 2021