Andhra Pradesh: పర్యాటక రంగంలో మరో అద్భుతం.. విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్​

నీటిపై ఎగిరే విమానాలు ఏపీలో చక్కర్లు కొట్టబోతున్నాయి. నీళ్లలో వాలి.. ప్రయాణికులను ఎక్కించుకుని, రెక్కలు విప్పి రివ్వుమని విహరించనున్నాయి. ఏపీ ప్రజలతోపాటు.. టూరిస్టులకు కొత్త అనుభూతిని ఇచ్చే ఈ సీ ప్లేన్స్‌ను సీఎం చంద్రబాబు రేపు ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగా.. నంద్యాల జిల్లా శ్రీశైలంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.. నూతన సీప్లేన్స్‌ లాంచ్‌ చేయనున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ నుంచి శ్రీశైలం పాతాళగంగ వరకు సీ ప్లేన్స్‌లో పర్యటిస్తారు.

Andhra Pradesh: పర్యాటక రంగంలో మరో అద్భుతం.. విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్​
Sea Plane
Follow us

|

Updated on: Nov 08, 2024 | 1:46 PM

పర్యాటకానికి సాంకేతిక సొబగులు అద్దుతోంది ఏపీ సర్కార్‌. పర్యాటకులకు మరుపురాని అనుభూతి పంచేందుకు సమాయత్తమవుతోంది. పర్యాటక రంగంలో మరో విప్లవం.. ఎస్‌.. మొన్న డ్రోన్‌షోతో ఆకట్టుకున్న ఏపీ ప్రభుత్వం మరో ప్రయోగానికి రెడీ అయ్యింది. ఈనెల 9న విజయవాడ పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్‌’ ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది. డీ హవిల్లాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు.

శ్రీశైలం జలాశయం SLBC టన్నెల్ పరిసర జలాల్లో సీ ప్లేన్ ల్యాండ్ కానుంది. సీ ప్లేన్ నుంచి సీఎం వచ్చిన తర్వాత రోప్ వే ద్వారా పైకి వచ్చి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న తర్వాత సీఎం సీప్లేన్లో విజయవాడ వెళ్తారు. విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌ నడిపేందుకు అనుకూలతలపై ఈ ప్రయోగం నిర్వహిస్తున్నారు. ఇది సక్సెస్‌ అయితే రాబోయే రోజుల్లో రెగ్యులర్‌ సర్వీసు ప్రారంభిస్తారు. విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి ప్రాంతాల్లోనూ సీ ప్లేన్ల ఏర్పాటుకు రెండోదశలో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పర్యాటకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు రూపొందిస్తోంది.

ఇటీవల జాతీయస్థాయి డ్రోన్‌ సమిట్‌ నిర్వహించగా ఇప్పుడు సీ ప్లేన్‌ ప్రయోగం చేస్తున్నారు. విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. సీ ప్లేన్స్ లాంచ్‌తో పర్యాటకంగా విజయవాడ మరింత అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు స్థానికులు.

పౌర విమానయాన మంత్రిత్వశాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సంయుక్తంగా సీ ప్లేన్‌ ప్రయోగం చేస్తున్నాయి. ప్రయోగం విజయవంతమయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..