Andhra Pradesh: పొత్తుకు ప్రాబ్లమ్స్‌ ఏమైనా ఉన్నాయా? లేదా ఎవరైనా అడ్డుతగులుతున్నారా?

|

Sep 24, 2023 | 7:04 PM

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు వేదికగా జనసేన, టీడీపీ మధ్య పొడిచిన పొత్తు... ఎందుకోగాని మరో అడుగు పడలేదు. బాబు అరెస్టు సమయంలో హడావుడి చేసిన జనసేన అధ్యక్షుడు ఇప్పుడు సడన్‌గా సైలెంట్‌ అయిపోయారు. ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని జైలు ముందు చెప్పారు, కాని పది రోజులైనా పవన్‌ కల్యాణ్‌ తరపు నుంచి ఉలుకు పలుకు లేదు. పొత్తుకు ప్రాబ్లమ్స్‌ ఏమైనా ఉన్నాయా? లేదా ఎవరైనా అడ్డుతగులుతున్నారా?

Andhra Pradesh: పొత్తుకు ప్రాబ్లమ్స్‌ ఏమైనా ఉన్నాయా? లేదా ఎవరైనా అడ్డుతగులుతున్నారా?
Weekend Hour
Follow us on

చంద్రబాబు అరెస్టు, కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బల తర్వాత ఏపీ రాజకీయాల్లో నెక్ట్స్‌ ఏం జరగబోతోందనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. చంద్రబాబు అరెస్టు విషయం తెలిసిన వెంటనే అత్యంత వేగంగా స్పందించిన వారిలో మొదటి వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడం, రోడ్డు మార్గాన వస్తూ దారిలో నడిరోడ్డుపై పడుకొని నిరసన తెలపడం అంతా చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు బాలయ్య, లోకేష్‌తో కలిసి రావడం, బాబును కలిసి మద్దతు ప్రకటించడం, పొత్తు ప్రకటన చేయడం అన్ని నిర్ణయాలు జెట్‌ స్పీడ్‌లో జరిగిపోయాయి.

టీడీపీ-జనసేన కలిసి ముందుకు సాగుతాయని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడం, ఆ వెంటనే పార్టీ కార్యాలయంలో ఆమోద ముద్ర వేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఉమ్మడి కార్యాచరణ రూపకల్పన కోసం నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసినట్టుగా ప్రచారం జరిగింది. కాని, ఆ తర్వాత ఏమైందో ఏమో జనసేన కంప్లీట్‌ సైలెన్స్‌ మోడ్‌లోకి వెళ్లిపోయింది. రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌ సాక్షిగా టీడీపీ- జనసేన మధ్య పొడిచిన పొత్తు పది రోజులైనా అడుగు ముందుకు పడకపోవడం ఇప్పుడు ఏపీలో చర్చానీయాంశంగా మారింది.

రెండు పార్టీల నాయకులు కలిసి చర్చించింది లేదు. ఈ మధ్య కాలంలో పవన్‌ కల్యాణ్‌ కనిపించింది లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు హాట్‌ హాట్‌గా ఉన్న సమయంలో పవన్‌ కల్యాణ్‌ సీన్‌లో లేకపోవడంపై చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణకు బీజేపీ నుంచి ఏమైనా అడ్డంకులు ఏర్పడుతున్నాయా? జనసేన పార్టీలోనే కొందరు పొత్తును వ్యతికేరిస్తున్నారా? రెండు పార్టీల మధ్య ఏం జరుగుతోందనన్నది ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ బీజేపీ నుంచి స్పష్టమైన సంకేతాలు కారణంగానే పవన్‌ సైలెంట్‌ అయ్యారని ఒక వర్గం అంటోంది. కోర్టులో ఉన్న విషయాలపై అనవసరంగా స్పందిస్తే చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో మౌనంగా ఉన్నారని మరో వర్గం చెప్తోంది. అరెస్టు భయంతోనే లోకేష్‌ ఢిల్లీలో ఉంటున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో స్పందించేందుకు ఇది తగిన సమయం కాదనే ఆలోచనతో పవన్‌ సైలెంట్‌గా ఉన్నారనే మాటలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తే ఉమ్మడి కార్యాచరణ మొదలవుతుందనే మాటలూ వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా ఈ సమయంలో పవన్‌ కల్యాణ్‌ ఎక్కడున్నారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ కీలక సమయంలో టీడీపీకి అండగా పవన్‌ కల్యాణ్‌ ఉంటే పాలిటిక్స్‌ మరో లెవల్‌లో ఉండేవనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.