Andhra: ఏపీలో మధ్యాహ్నం 3 దాటిన తర్వాత వర్షాలు.. ఒకటి, రెండ్రోజులు కాదు..
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 30-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా సూచించారు. సాయంత్రం వేళల్లో వర్షాలు అధికంగా ఉంటాయి.

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు రోజుల వర్ష హెచ్చరికను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవవచ్చు. భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని, ఇవి ఎక్కువగా అక్కడక్కడా కురిసే వర్షాలు (ఐసోలేటెడ్ రైన్స్) అని ఆమె స్పష్టం చేశారు. ఈ వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది, కొన్ని సందర్భాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగం వరకు కూడా గాలులు పెరగొచ్చు. ఈ వర్షాలు ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రం 3 గంటల తర్వాత సంభవించే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ పరిస్థితి రాబోయే ఐదు రోజుల వరకు కొనసాగవచ్చని, ఆ తర్వాత ఏప్రిల్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు తిరిగి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వర్షాలను అకాల వర్షాలుగా భావించరాదని, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సంభవించే సమ్మర్ రైన్స్ అని.. ఇవి సాధారణ వాతావరణ మార్పులేనని స్టెల్లా వివరించారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి వంటి వాతావరణ పరిస్థితుల వల్ల ఇలాంటి వర్షాలు కురవడం సహజం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ప్రజలు ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. బయటకు వెళ్లడం మానుకోవాలి. విద్యుత్ స్తంభాలు, నీటి వనరులు, చెట్ల కింద నిలబడటం, బయట ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వంటివి పూర్తిగా నివారించాలని సూచించారు. సురక్షితమైన ప్రదేశాలలో ఉండటం శ్రేయస్కరం. రైతులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం పంట ఉత్పత్తులు ఆరబెట్టుకుంటున్న రైతులు, మధ్యాహ్నం 3 గంటలలోపు వాటిని సురక్షితంగా ఇంట్లోకి లేదా కవర్ చేసిన ప్రదేశాలకు తరలించాలని తెలిపారు. హార్వెస్టింగ్ పనులు కూడా 3 గంటలలోపే పూర్తి చేసుకోవడం మంచిదని సూచించారు. బహిరంగ పొలాల్లో పనిచేసే రైతులు, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకుండా, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు, ఎందుకంటే ఇది ప్రాణాలకు ప్రమాదకరం. మెరుగైన వాతావరణ అంచనాల కోసం, భారత వాతావరణ శాఖ తన అబ్జర్వేషన్ నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కావలి, అమలాపురంలో రెండు కొత్త వాతావరణ రాడార్లను ఏర్పాటు చేయనున్నట్లు స్టెల్లా ఈ సందర్భంగా వెల్లడించారు.
ప్రపంచ వాతావరణ దినోత్సవం సందర్భంగా “నేడు పరిశీలించడం, రేపటిని రక్షించడం” అనే థీమ్‌ను ప్రస్తావిస్తూ, ప్రజల ఆస్తులను, ప్రాణాలను కాపాడటమే వాతావరణ శాఖ ప్రధాన లక్ష్యమని ఆమె ఉద్ఘాటించారు. వాతావరణ అంచనాలు పటిష్టంగా ఉంటేనే ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
