
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన విశాఖలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు డిప్యూటీ కలెక్టర్లతోపాటు మరో ముగ్గురు అధికారులకు తాజాగా జాయింట్ కలెక్టర్ నోటీసులిచ్చారు. ఈనెల 22న విచారణకు హాజరుకావాల్సిందిగా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఆదేశాలు జారీ చేశారు. 22న శనివారం విశాఖపట్నం సంయుక్త కలెక్టర్ అశోక్ తన ఛాంబర్‌లో విచారణ జరపనున్నారు. అయితే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు విశాఖ కలెక్టరేట్ ఎఫ్-సెక్షన్ పర్యవేక్షకులుగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ చోట్ల డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఈ మేరకు.. ధర్మచంద్రారెడ్డి, ఎస్‌డీ అనిత, ప్రమీలా గాంధీ, సుబ్బారావు, బి.రవికుమార్, మురళీధర్, కె.విజయభాస్కర్ కు అధికారులు నోటీసులు అందించారు.
ఇక 2017లో విశాఖలోని కొమ్మాది, ఎండాడ ప్రాంతాల్లో 367, 368, 369, 370 సర్వే నంబర్లలో కొన్ని భూముల రికార్డులను ట్యాంపరింగ్ చేశారు. ఈ అక్రమాల విలువ 3వేల కోట్లు ఉంటుందనే చర్చ నడిచింది. దస్త్రాల తారుమారు విషయంలో అధికారుల పాత్రపై తీవ్ర ఆరోపణలు రావడంతో… నిజానిజాలు తేల్చేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఇక రంగంలోకి దిగిన సిట్ అధికారులు ఇద్దరు తహసీల్దార్లతోపాటు, రెవెన్యూ, సర్వేశాఖకు చెందిన కొందరు ఉద్యోగులను అరెస్టు చేశారు. అలాగే పలువురు ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులకు నోటీసులు జారీచేశారు.
అయితే 2019లో ప్రభుత్వం మారడంతో కేసు కాస్తా మూలనపడింది. ఇక గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రికార్డుల ట్యాంపరింగ్ కేసును మళ్లీ సీరియస్‌గా తీసుకుంది. ట్యాంపరింగ్ కేసుకు సంబంధించి అభియోగాలు నమోదైన అధికారులపై విచారణ జరపాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులివ్వడంతో ఇన్వెస్టిగేషన్ స్పీడర్ చేశారు అధికారులు..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..