మరోసారి కోడి కత్తి శ్రీను కేసు తెరపైకి వచ్చింది. తమ కొడుకు శ్రీనుకు బెయిల్ ఇవ్వకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని శ్రీను తల్లి తండ్రులు హెచ్చరించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక కు చెందిన జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడి కత్తి శ్రీను విశాఖ ఎయిర్ పోర్ట్ లో2018 అక్టోబర్ 25 న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తి తో దాడి చేశాడు. ఈ కేసులో రిమాండ్ ఖైదీ గా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడి కత్తి శ్రీనును విడుదల చేయాలని తల్లిదండ్రులు సావిత్రి, తాతారావు డిమాండ్ చేశారు. ఎన్.ఐ.ఎ పోలీసులు తన కుమారుడు పై 307 సెక్షన్ పెట్టి బెయిల్ రాకుండా చేస్తున్నారనీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అంతేకాదు ఇటీవల విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో దాడికి సంబంధించి అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది కి బెయిల్ వచ్చింది. మరి తమ కొడుకు శ్రీనుకి ఎందుకు బెయిల్ ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. అయితే శ్రీనుకు 2019 మే 25న కోర్టు బెయిల్ ఇచ్చింది. రెండు నెలల 15 రోజుల తరువాత 2019 ఆగస్టు 13 న బెయిల్ రద్దు చేసి మళ్లీ రిమాండ్ లో ఉంచారు.
గత నాలుగు సంవత్సరాలు గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కోడి కత్తి శ్రీను ఉన్నాడు. దీంతో తమ కుటుంబం అంతా మానసిక క్షోభకు గురి అవుతోంది అంటూ శ్రీను తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ లాయర్ సలీమ్ తో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి ని కలుస్తామని చెప్పారు. వృద్దాప్యం లో ఉన్న మమ్మల్ని ఎవ్వరు చూసుకునే వారు లేరు.. తమ కుమారుడు కు బెయిల్ ఇవ్వకపోతే ఆమరణ నిరాహారదీక్ష చేపడతామని కోడి కత్తి శ్రీను తల్లిదండ్రులు సావిత్రి, తాతారావు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..