
ఏపీలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భారీ గుడ్ న్యూస్. కూటమి సర్కార్ ‘తల్లికి వందనం’ పథకాన్ని విద్యార్థుల చదువుల కోసం అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకం ద్వారా ఆర్ధిక సాయం అందిస్తోంది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతీ ఏడాది రూ.15 వేలు అందిస్తోంది. ఈ ఆర్ధిక సాయాన్ని తల్లిదండ్రుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తింపచేస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే వీటిని అందిస్తోంది. దీంతో విద్యార్థుల ఫీజులు, పుస్తకాలు కోసం వీటిని తల్లిదండ్రులు ఉపయోగించుకోవచ్చు.
ఈ నెల 12వ తేదీ నుంచి ఏపీలో పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం తిరిగి తెరుచుకుంటున్నాయి. దీంతో జులైలో తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి నిధుల విడుదలకు ఆమోదం తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే రిలీజ్ చేసేందుకు ఆమోదముద్ర వేశారు. దీంతో జులై మొదటి వారంలోనే వీటిని జమ చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. గత ఏడాది స్కూల్స్ ప్రారంభమైన తర్వాత జూన్‌లోనే నిధులు విడుదల చేశారు. అయితే ఈ సారి కొన్ని సాంకేతిక సమస్యల వల్ల వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. గత ఏడాది 67.27 లక్షల మందికి పథకం అమలు చేయగా.. ఈ సారి లబ్దిదారుల సంఖ్య పెరగనుంది. సుమారు 68 లక్షల మంది ఈ సారి లబ్దిదారులుగా ఉండే అవకాశముంది.
ఈ పథకం కింద ప్రతీ విద్యార్థి తరపున తల్లిదండ్రుల అకౌంట్లలో రూ.15 వేలు అందిస్తుండగా.. వీటిల్లో పాఠశాలల నిర్వహణ కోసం రూ.2 వేలు కట్ చేస్తున్నారు. మిగతా రూ.13 వేల సొమ్మును ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే ఈ నిధులు అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా విద్యార్థి తల్లి బ్యాంక్ అకౌంట్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పీసీఐ లింక్ జరిగి ఉండాలి. ఒకవేళ లింక్ జరక్కపోతే బ్యాంక్‌కు వెళ్లి చేసుకోవాలి. త్వరలోనే అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం లబ్దిదారుల జాబితా తయారుచేస్తుండగా.. పారదర్శకంగా రూపొందాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెలలో లబ్దిదారుల జాబితా సిద్దం కానుండగా.. వచ్చే నెలలో బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనున్నారు. దీంతో ఈ నగదు కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు.