
తమిళనాడులోని కరూర్‌లో టీవీకే అధినేత విజయ్ ర్యాలీలో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంలో 10 మంది చిన్నారులు, 18 మంది మహిళలు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. మరికొందరిని పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. మరో 46 మందికిపైగా గాయపడగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులోని కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది. అనేక మంది స్పృహతప్పి పడిపోయారు. పరిస్థితి గమనించిన విజయ్.. ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. కొంత మందికి విజయ్ స్వయంగా వాటర్ బాటిల్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే పరిస్థితి మరింత చేయి దాటి.. భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఉక్కపోత, ఊపిరాడని పరిస్థితులతో చూస్తుండగానే పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. భారీ జన సమూహంలో అతికష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్సుల్లో బాధితులను ఆస్పత్రులకు తరలించారు.
కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ ట్వీట్ చేశారు. తొక్కిసలాట ఘటనతో హృదయం ముక్కలైందన్నారు. దుఃఖం, బాధలో మునిగిపోయానని.. ఈ బాధ భరించలేనిది.. వర్ణించలేనిది అన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు విజయ్ ప్రకటించారు.
కరూర్ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహా విషాద ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ఘటనాస్థలంలో తక్షణ సహాయచర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని రకాల సాయం అందించేందుకు అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. ఇవాళ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు సీఎం స్టాలిన్. అటు.. ఘటనపై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ అయింది. రిటైర్డ్ జడ్జి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు చేసింది. అటు.. ర్యాలీకి పర్మిషన్ తీసుకున్న పలువురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక.. కరూర్ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో పలువురు మృతి చెందడం బాధాకరం అన్నారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు ద్రౌపది ముర్ము. కరూర్ ఘోర విషాద ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు ప్రధాని మోదీ. బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మరోవైపు.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ వార్తా కథనాల కోసం ఇక్కడ వీక్షించండి.
బాంబు బెదిరింపుతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది
ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది
ఎయిర్‌పోర్ట్ సహా పలు స్కూల్‌లకు కూడా బాంబు బెదిరింపులు
గ్రూప్-2 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్‌సీ ఛైర్మన్
783 పోస్టులకు గాను 782 మంది అభ్యర్థుల ఎంపిక
వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం
పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితి అడిగితెలుసుకున్న సీఎం చంద్రబాబు
బీసీసీఐ వార్షిక సమావేశంలో అధ్యక్షుడి ఎన్నిక
రోజర్ బిన్నీ స్థానంలో ఎన్నికైన మన్హాస్
బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రాజీవ్ శుక్లా
కాంకేర్ జిల్లాలో ఎన్‌కౌంటర్
పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం
శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీల్లో అరుదైన వన్యప్రాణులను ఓ ప్రయాణికుడినుంచి స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్‌కు చేరుకున్న ప్రయాణికుడి నుంచి అరుదైన రెండు తలల ఎర్రచెవి స్పైడర్ తాబేలు, అరుదైన మ్యాన్ ఈటర్ బల్లి, నాలుగు గ్రీన్ ఇగువానాస్, అరుదైన మరో 12 ఇగువానస్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరిగి బ్యాంకాక్‌కు తరలిస్తున్నారు. వన్యప్రాణులను తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు అధికారులు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. రెండు నదుల్లోనూ వరద ప్రవాహం పోటెత్తుతోంది. దీంతో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం నీటిమట్టం 13.5 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో 4,90,000 క్యూసెక్కులుగా ఉంది. 70 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఇప్పటికే 44.9 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 9.88 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. అదే స్థాయిలో నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం 6.30కు గరుడవాహన సేవ నిర్వహిస్తారు. గురుడ వాహన సేవకు TTD భారీ ఏర్పాట్లు చేశారు. అలిపిరి దగ్గర వాహనాలు బారులుతీరాయి. గరుడ సేవకు దాదాపు 2 లక్షల మందికి పైగానే భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. 5 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమలలో క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం TTD టెక్నాలజీని వినియోగిస్తున్నారు. AI ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర నిఘా పెట్టారు.
కరూర్ తొక్కిసలాట బాధితులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిహారం ప్రకటించారు. చనిపోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షల సాయం అందజేయనున్నట్లు తెలిపారు. గాయపడిన వారికి రూ.50వేల సాయం అందిస్తామన్న మోదీ వెల్లడించారు. రాజకీయ ప్రచారసభలో ఈ దుర్ఘటన జరగడం దురదృష్టకరమని ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
అప్పటిదాకా ఇసుకేస్తే రాలనంతమంది జనం. విజయ్ అక్కడికి చేరుకుని ప్రచారరథంపైకి ఎక్కి మైక్ పట్టుకోగానే మొదలైంది తొక్కిసలాట. తొక్కిసలాటపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కానీ 10వేలమంది పట్టేచోట అంతకు ఐదురెట్లమంది రావడంతో దారినవెళ్లేవాళ్లు కూడా ముందుకెళ్లలేక అక్కడే ఇరుక్కుపోయారు. కరూర్ తొక్కిసలాట బాధితులకు TVK పార్టీ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షల పరిహారం అందజేయనున్నట్లు విజయ్ తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎవరూ పూడ్చలేని నష్టం జరిగింది..పార్టీ తరపున అన్నివిధాలా అండగా ఉంటామని విజయ్ అన్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అచ్చంపేట మండలం రంగాపూర్‌లోని ఉమామహేశ్వర క్షేత్రం దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. భక్తులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అప్రమత్తంగా ఉండాలని భక్తులకు అధికారుల సూచించారు. ఈ క్షేత్రంలోని పాపనాశనం వైపు భక్తులు ఎవరు వెళ్లవద్దని కోరుతున్నారు. శ్రీశైలం వెళ్లే దారిలో రంగాపూర్ దగ్గర ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడికి భక్తుల తాకిడి బాగానే ఉంటుంది. నిన్న అర్థరాత్రి సమయంలో కొండ చరియలు విరిగిపడడంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది.
అప్పుల బాధ తట్టుకోలేక 21 సంవత్సరాల మొహమ్మద్ అబ్బుబకార్ సిద్ధికి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య కి పాల్పడ్డాడు. హైదరాబాద్ పాతబస్తీ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిడా రోడ్డులో నివసించే మొహ్మద్ అబూబకర్ సిద్ధికి 4నెలల క్రితం పెళ్లి అయింది.
ఆర్థిక లావాదేవీలో దెబ్బ తిన్న సిద్ధికి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం (సెప్టెంబర్ 27) అర్ధరాత్రి సమయం ఇంటి గడియ పెట్టుకుని ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఐఎస్ సదన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం తో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీ కి తరలించారు.
తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోం శాఖ ఆరా తీసింది. ఈ దుర్ఘటనపై తక్షణమే నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, గవర్నర్ రవికి ఫోన్ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని సూచించారు.
భాగ్యనగరంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు వీలుగా ఈ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ’ (FCDA)ని ఏర్పాటు చేసింది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 30 వేల ఎకరాల్లో ఈ అధునాతన సిటీని నిర్మిస్తోంది. 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవిన్యూ గ్రామాల పరిధిలో ఈ సిటీ విస్తరించనుంది.
బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో 10K, 5K, 3K రన్ నిర్వహించారు. మేఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫౌండేషన్‌తో కలిసి సుధా రెడ్డి ఫౌండేషన్ ఫౌండర్, చైర్‌పర్సన్ సుధా రెడ్డి ఆధ్వర్యంలో పింక్ పవర్ రన్ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా దగ్గర నిర్వహించిన పింక్ పవర్ రన్ 2.0లో 25 వేల మంది పాల్గొన్నారు. గతేడాది తొలి ఎడిషన్ విజయవంతంగా పూర్తి అయింది. ఈసారి కూడా అదే ఉత్సాహంతో పింక్ పవర్ రన్ 2.0 సక్సెస్ ఫుల్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MEIL MD మేఘా కృష్ణారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, మిస్ వరల్డ్ ఓపల్ సుచాతా, నటుడు బ్రహ్మానందం, టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం10K, 5K, 3K రన్ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్ బకాయిల్లో రూ. 394.29 కోట్లు చెల్లించేందుకు విడివిడిగా ఆరు ఉత్తర్వులు ఇచ్చింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు మూడు త్రైమాసికాల ఫీజు బకాయిలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం కళాశాలలకు చెల్లించాల్సి ఉంది. గతంలో ప్రభుత్వం మొదటి విడత పూర్తిగా చెల్లించగా.. రెండో విడతలో కొంత విడుదల చేసింది. ఇప్పుడు మిగతా బకాయిల మొత్తం విడుదలకు చర్యలు తీసుకుంది.
గోల్డ్ రేట్ రోజుకో కొత్త రికార్డులను బ్రేక్ చేస్తోంది. సామాన్యులు, మధ్య తరగతి వాళ్లకే కాదు ఓ మోస్తరు ఆదాయమున్న వారికి కూడా అందకుండా దూసుకెళ్తోంది. మన దేశంలో పెళ్లిళ్లతో పాటు శుభకార్యాల అన్నింటిలోనూ బంగారం కొనుగోలు చేయడం అనేది తప్పనిసరి. ఇలాంటి సమయంలో తులం బంగారం ధర ఏకంగా లక్ష 15 వేలు దాటడంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది కష్టంగా మారింది. బంగారంపై పెట్టుబడులు ఎక్కువ కావడం.. గోల్డ్ రేట్ పెరుగుదలకు కారణమవుతోంది. అయితే రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
-తెలుగు రాష్ట్రాల్లో వరదలు భయపెడుతున్నాయి. హైదరాబాద్‌లో మూసి పరివాహక ప్రాంతాలు వరదలతో అల్లాడుతున్నాయి. దక్షిణ ఒడిశా-గోపాల్‌పూర్ దగ్గర ఏర్పడ్డ వాయుగుండం తీరం దాటింది. ఏపీ సహా తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్,
సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీలో ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచించింది.
అతివేగంగా వచ్చిన లారీ, రైతు ప్రాణాలు తీసింది. ఈ ఘటన సిద్దిపేట సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సిపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. మల్లారెడ్డి అనే రైతు తన వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రామాయంపేట వైపు నుండి సిద్దిపేట వైపునకు వస్తున్న లారీ అతివేగంగా వచ్చి రైతును ఢీకొట్టింది. దీంతో రైతు మల్లారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న దుబ్బాక పోలీసులు సంఘటన చేరుకుని గ్రామస్తులకు కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ శివారు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన కారు, డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందాడు. చిన్నారి సహా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. తుక్కుగుడా నుండి గచ్చిబౌలి వైపు వెళుతున్న కారు తొండుపల్లి ఎక్సిట్ 16 వద్ద ప్రమాదానికి గురైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
నవరాత్రులపై నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ మామూలుగా లేదు. దుర్గామాత పందిళ్లను కుప్పకూల్చేస్తున్నాయి మాయదారి వానలు. విజయదశమి వరకూ వదలనంటోంది కుండపోత. దేశమంతా వాన ముసురు పట్టి.. ఆరేడు రాష్ట్రాలు వర్షపు తాకిడితో తప్పతడిసిపోతున్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతోంది. మరో రెండురోజులు కుండపోత తప్పదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అక్టోబర్ 5వ తేదీ దాకా నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ ఉంటుందని, ఒడిషా, కేరళ, మహారాష్ట్రతో పాటు, ఈశాన్య రాష్ట్రాలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ విభాగం.
తమిళనాడులోని కరూర్‌లో ఘటనపై TVK నాయకులపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పది వేల మందికి అనుమతి ఇస్తే, 27 వేల మంది వచ్చారని తమిళనాడు డిజిపి వెంకట రామన్ తెలిపారు. మధ్యాహ్న 1 గంట కు రావాల్సిన విజయ్ సాయంత్రం 7 గంటలకు వచ్చారు. క్రౌడ్ పెరిగిపోవడంతో ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని డిజిపి వెంకట రామన్ తేల్చి చెప్పారు. మరోవైపు విజయ్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం తరుపున బెజవాడ కనకదుర్గమ్మకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సోమవారం సాయంత్రం 3 నుండి 4:30 గంటల మధ్య ఇంద్రకీలాద్రికి చేరుకుని పట్టు వస్త్రాలు అందజేస్తారు. కాగా, నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రంతో రేపు సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇవ్వనున్నారు దుర్గమ్మ. ఈ నేపథ్యంలోనే రేపు అన్ని వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని దర్శన క్యూలైన్లు ఉచిత దర్శనాలను కల్పిస్తున్నట్లు ఆలయల అధికారులు వెల్లడించారు.