
Andhra Pradesh: రేషన్ బియ్యం నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు ఏపీ సర్కార్ కీలక చర్యలు చేపట్టింది. ఇకపై రేషన్ దుకాణాల ద్వారా గరిష్ఠంగా 10 శాతం నూకలు ఉన్న బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. సెప్టెంబరు 1 నుంచే 17 జిల్లాల్లో ఈ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. వచ్చే నెలలో మరో 20 జిల్లాలకు విస్తరించనున్నారు. ఆ తర్వాత రెండు, మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ బియ్యం అందుబాటులోకి రానుంది.
గతంలో రేషన్ బియ్యంలో దాదాపు 25 శాతం వరకు నూకలు ఉండేవి. అనంతరం సార్టెక్స్ విధానంలో 15 శాతం నూకలు ఉన్న బియ్యాన్ని సరఫరా చేశారు. ఇప్పుడు నాణ్యతను మరింత పెంచే ఉద్దేశంతో నూకల శాతాన్ని 10 శాతానికి తగ్గించారు. ఇప్పటికే పలు రేషన్ దుకాణాలకు కొత్త బియ్యం చేరింది. కొన్ని ప్రాంతాల్లో పంపిణీ కూడా ప్రారంభమైంది. అయితే గత నెలలో సరఫరా చేసిన 15 శాతం నూకలున్న బియ్యం నిల్వ ఉన్న దుకాణాల్లో ముందుగా వాటిని పంపిణీ చేస్తున్నారు. ఆ నిల్వలు పూర్తయిన తర్వాత 10 శాతం నూకలున్న కొత్త బియ్యాన్ని కార్డుదారులకు అందించనున్నారు.
రేషన్ దుకాణాల ద్వారా భవిష్యత్తులో స్టీమ్ బియ్యం పంపిణీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ అనుమతి కోరుతూ కమిషనర్ కన్నబాబు లేఖ రాశారు. కేంద్రం నుంచి అనుమతి లభిస్తే 10 శాతం నూకల పరిమితితో కూడిన స్టీమ్ రైస్‌ను కూడా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ బ్రాండ్ల పేర్లతో విక్రయించే బియ్యంలో ఎక్కువ భాగం స్టీమ్ రైస్ ఉండగా, కొన్ని రకాల బియ్యం కిలో రూ.70 వరకు విక్రయమవుతున్నాయి.
రాష్ట్రంలో సుమారు 4.35 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 2.31 లక్షల టన్నుల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్క కిలో బియ్యానికి ప్రభుత్వానికి సగటున రూ.46 వరకు ఖర్చవుతోంది. అయితే చాలామంది కార్డుదారులు రేషన్ ద్వారా లభించే బియ్యాన్ని తమ అవసరాలకు వినియోగించకుండా వ్యాపారులకు విక్రయిస్తున్నారనే అభిప్రాయం ప్రభుత్వానికి ఉంది. ఆ తర్వాత ఇంటి అవసరాల కోసం మార్కెట్‌లో ఇతర బ్రాండ్ల బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.
ఈ పరిస్థితిని మార్చేందుకు రేషన్ బియ్యం నాణ్యతను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. నూకలు తగ్గించడంతోపాటు స్టీమ్ రైస్ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రేషన్ బియ్యాన్ని కార్డుదారులు నేరుగా వినియోగించేలా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
10 శాతం నూకలతో కూడిన కొత్త రేషన్ బియ్యాన్ని క్యూఆర్ కోడ్ ఉన్న బస్తాల్లో సరఫరా చేస్తున్నారు. దీని ద్వారా బియ్యం సరఫరా, పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 29,844 రేషన్ దుకాణాలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో కొత్త రకం బియ్యం పంపిణీ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం నాణ్యతలో గణనీయమైన మార్పు కనిపించే అవకాశం ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి