Andhra Pradesh: నేరగాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుంటారు. కొందరిని వారి అవసరం నేరాల బాట పట్టిస్తే.. ఆ నేరాలు చేసేందుకు మరికొందరు వేర్వేరు మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే విశాఖలో మాత్రం ఓ కేటుగాడు డిఫరెంట్‌గా ఆలోచించాడు. తాను మోసపోయిన విధానాన్నే అస్త్రంగా మలచుకున్నాడు. ప్లాన్ ల మీద ప్లాన్స్ వేస్తూ.. మోసాలు చేస్తూ.. లక్షల కొద్ది సొమ్ము కూడగడుతూ అందరికీ టోపీ పెట్టేస్తున్నాడు.
రైల్వేలో ఏ జాబ్ కావాలన్నా క్షణాల్లో మీ సొంతం.. కాసులిస్తే చాలు అనుకున్న ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్ మీ చేతిలోనే..! ఏమాత్రం డౌట్ కూడా రాకుండా.. ఐడి కార్డు కూడా పక్కగా ఉంటుందండోయ్..! మరి ఆ స్టైల్‌లో చక్రం తిప్పుతాడు. తనను నమ్మి వచ్చినందుకు ఎవరికీ అన్యాయం చేయకుండా పంపించేలా నటిస్తాడు. ఎంతైనా రైల్వే ఉద్యోగాలు కదా..! ఖర్చు మాత్రం లక్షల్లోనే మరి. అయితే, ఇదంతా వాడి డ్రామాలో పార్ట్.. అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కేటుగాడి పేరు పిల్లి నాగరాజు. ఊరు విశాఖలోని కంచరపాలెం. పని పాట ఏమీ లేదు. అప్పుడప్పుడు డెలివరీ బాయ్‌గా చేస్తుంటాడు. కానీ తనను నమ్మిన వారికి మాత్రం.. నట్టేట ముంచకుండా అసలు వదలడు. ఏకంగా రైల్వేలో ఉద్యోగాల కోసం ఆఫర్ చేస్తున్నాడు. టిటిఈ, క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్.. ఇలా రైల్వేలో ఏ జాబ్ కావాలన్నా చిటికెలో చేసి పెట్టేస్తున్నాడు. వీడితో మాట కలిపి కాసులిస్తే చాలు.. ఆఫర్ లెటర్ మీ చేతిలో పెట్టేస్తున్నాడు. అంతేకాదు.. కనీసం పరీక్షలు కూడా లేకుండా, ఇంటర్వ్యూలు కూడా ఆఫర్ చేయకుండా డైరెక్ట్‌గా ఐడి కార్డు కూడా ఇచ్చి జాబు మీ సొంతమని కళ్ళముందు మ్యాజిక్ చేస్తున్నాడు. పిల్లి నాగరాజు.. మాటలు విన్న, నమ్మిన నిరుద్యోగులు వాడి వెనక క్యూ కట్టారు. కేవలం బయట వ్యక్తులు కాదు.. దగ్గర బంధువులు కూడా లైన్లోకి వచ్చారు. తన దగ్గరకు వచ్చిన వారందరినీ విశాఖ నగరంలోని రైల్వే డిఆర్ఎం కార్యాలయం వద్దకు పిలిపించి మాయ చేసేవాడు. తాను ఆ కార్యాలయంలోనే ఓ అధికారి వద్ద పనిచేస్తున్నాని అంటూ బిల్డప్ ఇచ్చేవాడు. ఏకంగా డిఆర్ఎం కార్యాలయం వద్ద దుకాణం పెట్టడంతో అంతా నిజమే అనుకున్నారు. ఎగ్జామ్ అటెండ్ చేయకుండానే.. ఇంటర్వ్యూ కూడా లేకుండానే.. జాబ్ గ్యారంటీని ఆఫర్ చేయడంతో ఇక వెనుదిరిగి చూడలేదు నిరుద్యోగులు. వాడు అడిగినంత దఫదఫాలుగా ఇస్తూ ఉద్యోగం కోసం ఆశతో ఉన్నారు. వారి ఆసనే క్యాష్ చేసుకున్న నూకరాజు.. ఒక్కొక్కరి నుంచి లక్షలు లాగేసాడు.
వీడి వ్యవహారం బయటపడిందిలా..
తనను నమ్మి వచ్చిన వారందరికీ.. కోరిన ఆఫర్ ఇస్తూ వచ్చిన ఈ కేటుగాడు.. అపాయింట్మెంట్ లెటర్ కూడా చేతిలో పెట్టాడు. అంతేకాదు ఐడెంటిటీ కార్డు.. సంబంధిత డాక్యుమెంట్లను చేతిలో పెట్టి ఉద్యోగం కోసం ఉరించాడు. చేతికి ఆఫర్ లెటర్, ఐడెంటి కార్డు వచ్చేసరికి అడిగినంత ఇచ్చుకున్నారు కొంతమంది నిరుద్యోగులు. చేతినిండా లక్షలు అందుకుంటున్న మాయగాడు.. ఆ తరువాత మొహం చాటేశాడు. చేతికి వచ్చిన ఆఫర్ లెటర్, ఐడి కార్డు తీసుకొని రైల్వే కార్యాలయాలకు వెళితే గాని వారికి అసలు విషయం అర్ధం కాలేదు. కొత్తవలసలో రైల్వే అధికారులు సదరు ఆఫర్లను పరిశీలించి.. విశాఖలోని డిఆర్ఎం కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. డిఆర్ఎం కార్యాలయానికి వచ్చిన ఆ బాధితులు.. అక్కడ కొంత మంది అధికారులను కలిశారు. వారి చేతిలో ఉన్న ఆఫర్ లెటర్లు, ఐడి కార్డులను చూపించారు. అవి చూసిన అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అటువంటి ఉద్యోగాలు లేవని చెబుతూనే.. మోసపోయారని వారికి చెప్పుకొచ్చారు. రైల్వే పోలీసుల సహకారంతో విశాఖలోని టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు అధికారులు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నకిలీ ఆఫర్ లెటర్లు, ఐడి కార్డులు సీజ్ చేసి నిందితుడు నాగరాజును ట్రాక్ చేశారు. చివరికి నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు వ్యవహారాలన్నీ బయటపడ్డాయి. నమ్మిన వాళ్ళని కాదు ఆఖరికి సొంత బంధువులను కూడా ముంచినట్లు గుర్తించామని టూ టౌన్ సిఐ వెంకటరావు తెలిపారు. నమ్మి వచ్చిన వారి అవసరాన్ని క్యాష్ చేసుకుని.. ఒక్కొక్కరినీ ట్రాప్ చేసి రూ. 40 లక్షల వరకు వసూలు చేశాడని చెప్పారు పోలీసులు.
కేటుగాడి స్కెచ్ విని అవాక్కైన పోలీసులు..
కాగా, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాడి వ్యవహారాలన్నీ తెలిసి అవాక్కయ్యారు. ఉద్యోగాల పేరుతో మోసం చేయడం ఎలా నేర్చుకున్నాడు అని ఆరా తీసేసరికి.. వాడి చరిత్ర అంతా బయటపడింది. నిందితుడైన నాగరాజు ఇంటర్ చదువుతున్న సమయంలో ఉద్యోగం కోసం అన్వేషించాడు. ఆ సమయంలో ఓ మోసగాడు చేతిలో పడి.. మోసపోయానని చెప్పుకొచ్చాడు. రైల్వేలో ఉద్యోగం కోసం వెళ్ళి తాను మోసపోయానని వివరించాడు. తాను మోసపోయిన విధానాన్ని అస్త్రంగా మలుచుకుని.. నిరుద్యోగులకు గాలం వేయడం ప్రారంభించామని పోలీసుల విచారణలో చెప్పుకొచ్చాడు. తాను మోసపోయిన తీరును, నమ్మిన విధానాన్ని ఫార్ములాగా చేసుకొని.. నిరుద్యోగులు ఉద్యోగం అంటే ఎలా క్యూ కడతారో ఆ వీక్‌నెస్‌ను పట్టుకున్నాడు. ఇక నోటికి వచ్చిన ఆఫర్లను ప్రకటిస్తూ రెండు చేతులా సంపాదిస్తూ జనాలను నిలువునా ముంచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
పోలీసులు అరెస్టు చేసిన సమయంలో నిందితుడు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. బయటపడిన బాధితుల్లో కొంతమందే..! ఇంకా వీడి ఉచ్చులో ఎంతమంది పడి మోసపోయారు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ కేటుగాడిని కస్టడీలోకి తీసుకొని.. ఇంకా ఎవరైనా బాధితులు ఉన్నారా? అన్న దానిపై పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు. ఇలాంటి మాయగాళ్లను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. డబ్బులు ఇవ్వగానే ఉద్యోగాలు వస్తున్నాయని ఆశ పడితే.. ఇటువంటి వారి చేతుల్లోనే మీ కష్టం కాస్త బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
Also read:
Green Energy: గ్రీన్ ఎనర్జీలో భారత్ అగ్రగామిగా నిలుస్తుంది.. 21 వ శతాబ్దం మనదే: ముఖేష్ అంబానీ
India vs Sri Lanka 1st T20: అభిమాన ప్లేయర్ కోసం రోడ్డెక్కిన ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?