Vellampally Srinivas: కుల, మత రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టేందుకు భారతీయ జనతా ర్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. బీజేపీ నేతలు మత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. సోము వీర్రాజు మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఆదేశాలతో వినాయక చవితి వేడుకలపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. సోము వీర్రాజు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ప్రశ్నించారు. పండుగలకు కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా హిందువులకు వ్యతిరేకమా.? అని దుయ్యబట్టారు. కేంద్రం ఇచ్చిన కోవిడ్ నిబంధనలను సోము వీర్రాజు మార్చగలరా అని వెల్లంపల్లి నిలదీశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కులమతాలకతీతంగా పాలన చేస్తున్నారన్నారని గుర్తు చేసిన మంత్రి.. బీజేపీ నేతలకు హిందూమతంపై గౌరవం ఉంటే గతంలోనే ప్రశ్నించేవారని, ఆలయాలను కూల్చిన టీడీపీని బీజేపీ ఏనాడూ ప్రశ్నించలేదని మంత్రి వెల్లంపల్లి ఫైరయ్యారు. వినాయక చవితి అందరి పండుగ, అందరూ చేసుకోవచ్చు. ఇళ్ళల్లో చేసుకోవచ్చు, దేవాలయాల్లోనూ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద విగ్రహాలు వీధుల్లో పెట్టి, ఊరేగింపులు, భారీ ఎత్తున వేలు, లక్షల మందితో ఊరేగింపులు, హంగామాలు, ఆర్భాటాలు చేయడం వద్దని మాత్రమే చెప్పాం. పక్కనున్న బీజేపీ పాలిత కర్ణాటక ప్రభుత్వం కూడా నిబంధలు విధించిందని మంత్రి గుర్తు చేశారు. కోవిడ్ నేపథ్యంలోనే.. కుంభ మేళాకు అనుమతిస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే అంటూ ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్ గారి మీద ఉంటుంది. మతం ముసుగులో బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారు తప్పితే.. మరొకటి కాదన్నారు. కోవిడ్ వల్ల ఇప్పటికీ ఎంతో మంది తమ కుటుంబాలను కోల్పోతున్నారు. ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి.. పండుగ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు.
Read Also… Bigg Boss 5 Telugu: అప్పుడలా… ఇప్పుడిలా..! లోబోను ఆడేసుకుంటున్న నెటిజన్లు. ఇంతకీ ఏమన్నాడంటే.
Army Jawan: డ్యూటీకి బయలుదేరిన ఆర్మీ జవాన్ అదృశ్యం.. మిస్టరీగా మారిన నవీన్ కుమార్ మిస్సింగ్ కేసు..!