ap municipal elections 2021: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ.. టీడీపీ నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడిన భాష బాధాకరం అన్నారు. ఇదే సమయంలో లోకేష్‌పైనా మండిపడ్డారు. లోకేష్ వాడుతున్న భాష పరమ నీచంగా ఉందన్నారు. చంద్రబాబు తన తనయుడి నోటికి ప్లాస్టర్ వేయాలని హితవు చెప్పారు. లేదంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. హుద్‌హుద్ తుపాన్ తర్వాత విశాఖ భూముల రికార్డులు తారుమారవ్వడం నిజం కాదా? అని చంద్రబాబును మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అతిపెద్ద దోపిడీ దారుడు అని ధ్వజమెత్తారు. జీవీఎంసీ బిల్డింగ్‌ను తాకట్టు పెట్టి నిధులు తీసుకు వచ్చారని విమర్శించారు. ‘విశాఖ, అమరావతి, హైదరాబాద్ అన్నీ నా గుండెల్లో ఉన్నాయని చంద్రబాబు అంటున్నారు.. ఆయన గుండె ఏమైనా చెరువా?’ అని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.
విశాఖ బీచ్ రోడ్డులో మలేషియా టవర్స్ తరహాలో భారీ నిర్మాణాలు చేపట్టబోతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. త్వరలోనే వీటికి సంబంధించి గ్లోబల్ టెండర్లు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఆస్తి పన్నుపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. 15శాతం మించి పెంచకుండా చట్టం కూడా చేశామని ఆయన గుర్తు చేశారు. దేశంలో టాప్ 100 మున్సిపాలిటీల్లో 40 ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని వెల్లడించారు. బెస్ట్ స్టేట్ అవార్డు ఇచ్చిన కేంద్ర మంత్రి.. ఎన్నికల కోసం విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. కేంద్ర మంత్రి విమర్శలు నిజమైతే.. వాళ్ళు ఇచ్చిన అవార్డులు అబద్దమా? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు చంద్రబాబు హయాంలోనే బీజాలు పడ్డాయని బొత్స అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎలా అడ్డుకోవాలో తమ ఎంపీలకు, తమకు అవగాహన ఉందన్నారు.
Also read: