Andhra Pradesh Minister Adimulapu Suresh – Revenue officials: ప్రకాశంజిల్లా పెద్దారవీడు మండల రెవెన్యూ అధికారులపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కాపురంలో డివిజన్ స్థాయి జగనన్న కాలనీల సమీక్షా సమావేశంలో మంత్రి సురేష్ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై విరుచుకుపడ్డారు. పెద్దారవీడు మండలంలో ప్రభుత్వ, పోరంబోకు భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. రెవెన్యూ అధికారులు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఇతరులకు ఆన్‌లైన్‌లో ఎక్కించి ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.
పెద్దారవీడు తహసీల్దార్ పోస్టింగ్ కోసం పదుల సంఖ్యలో అధికారులు క్యూలో ఎందుకు ఉంటున్నారో ఇప్పుడు అర్దం అవుతుందన్నారు. వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఇప్పటికే ఆన్‌లైన్ చేసి అక్రమార్కులకు దోచి పెడుతున్నారన్నారు. పెద్దారవీడు మండలంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గత నాలుగేళ్ళుగా ప్రభుత్వ భూముల అన్యాక్రాతంపై విచారణ చేస్తామన్నారు.
ఇప్పటికే భూముల ఆన్‌లైన్ కుంభకోణంపై నలుగురు స్పెషల డిప్యూటీ కలెక్టర్ల ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించామని మంత్రి ఆదిమూలపు వెల్లడించారు. తన 13 ఏళ్ల ఎమ్మెల్యే పదవీకాలంలో ఐదుగురు పెద్దారవీడు తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారంటే ఈ మండలంలో అవినీతి, అక్రమాలు ఎంత విచ్చలవడిగా జరుగుతున్నాయో అర్ధం అవుతుందన్నారు. ప్రభుత్వ భూములు కాపాడకుంటే కఠిన చర్యలు తప్పవని, ఇదే తహసీల్దార్లకు చివరి హెచ్చరిక చేస్తున్నామన్నారు మంత్రి ఆదిమూలపు.
Read also: CCTV surveillance: బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేశారో.. సీసీ కెమెరాల్లో చిక్కేస్తారు. ఆపై పూం పుహారే..!