AP High Court on MRO: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andra Pradesh High Court) సంచలన తీర్పు వెలువరించింది. ఓ మండల తహసీల్దార్‌కు జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో కర్నూలు జిల్లా(Kurnool District)లోని సి బెళగల్(C Belagal) ఎమ్మార్వోకు హైకోర్టు జైలు శిక్షను ఖరారు చేసింది. ఎమ్మార్వో జె.శివశంకర నాయక్(Shiva Shankar Naik)కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు నిచ్చింది. మండలంలోని కొత్తకోటలో భూమి మ్యుటేషన్ కోసం ఓ రైతు దరఖాస్తును ఎమ్మార్వో పట్టించుకోకపోవడంతో హైకోర్టు విచారణ చేపట్టింది.
వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ముడుమాల గ్రామానికి చెందిన పింజరి కరీం సాబ్ అదే మండల పరిధిలోని కొత్తకోట గ్రామం సరిహద్దులో సర్వే నెం. 430/ 1లో 11 ఎకరాల 73 సెంట్ల తన సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన భూమికి సంబంధించి మ్యుటేషన్ నిమిత్తమై స్థానిక ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకున్నారు. ఎమ్మార్వో శివశంకర నాయక్ గ్రామ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి కరీం సాబ్ దరఖాస్తును తిరస్కరించారు. ఈ నేపథ్యంలో కరీం సాబ్ తనకు న్యాయం చేయాలని కోరుతూ న్యాయవాది చల్లా శివశంకర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు రైతు భూమిని మ్యుటేషన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎమ్మార్వో ఈ ఉత్తర్వులను పట్టించుకోలేదు. కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో ఎమ్మార్వోకు హైకోర్టు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణకు సంబంధించి ఈ తీర్పు వెలువరించింది.
ఈ కేసుకు సంబంధించి ఉన్నత న్యాయస్థానం సి.బెళగల్ ఎమ్మార్వో సంబంధిత రైతు మ్యుటేషన్ కోసం చేసుకున్న దరఖాస్తును తిరస్కరిస్తూ ఇచ్చిన ఆదేశాలు చెల్లవని తీర్పునిస్తూ మ్యుటేషన్ చేయాలని ఆదేశించింది. కాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం అమలుచేయకపోవడంతో ఎమ్మార్వో శివశంకర నాయక్ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టు ధృవీకరించి ఆయనకు ఆరు నెలల సాధారణ జైలుశిక్షతో పాటు రూ.2,000 లు జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు వారాలు జైలుశిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది.