Andhra Pradesh Inter Admissions: కరోనా మహమ్మారి పుణ్యామాని ఇంతకాలం విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలు తెరుచుకునేందుకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అనుమతులు ఇచ్చింది. అయితే, ఆన్‌లైన్ ప్రవేశాలపై ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. సెంట్రల్ ఆంధ్రా జూనియర్ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై అమరావతి హైకోర్టు విచారణ చేపట్టింది. అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డితో పాటు విద్యార్థులు పిటిషన్ వేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, బి.ఆదినారాయణరావు, న్యాయవాది నల్లూరి మాధవరావు వాదనలు వినిపించారు.
ఆన్‌లైన్ ప్రవేశాలకు నిబంధనలు రూపొందించలేదని, నిర్వహణ విధానాన్ని ప్రకటించలేదని పిటిషనర్లు కోర్టుకు వివరించారు. గతేడాది పత్రికా ప్రకటన ద్వారా ఆన్‌లైన్ విధానాన్ని తీసుకొస్తే హైకోర్టు తప్పుపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి కూడా అదే విధంగా పత్రికా ప్రకటన ద్వారా ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఇచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, బోర్డు చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని.. నిబంధనలు రూపొందించకుండా ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించడానికి వీల్లేదని కోర్టుకు నివేదించారు.
‘‘విద్యార్థులు కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లో ప్రవేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్ బోర్డు చెబుతోంది. భౌతిక ప్రవేశాలకు కోవిడ్ అడ్డంకి అయితే, ఈనెల 16 నుంచి ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం ఎలా తీసుకుంది. ఇందు కోసం ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ విధానంతో కోరుకున్న కళాశాలలో చదువుకునే హక్కును విద్యార్థులు కోల్పోతున్నారు. ఇంటర్ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్‌ను నిలిపివేయాలి’’ అని పిటిషనర్లు హైకోర్టుకు తమ వాదనలు వినిపించారు.
కోవిడ్ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ప్రవేశాలు నిర్వహిస్తున్నామని ఇంటర్ బోర్డు తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. పరీక్ష నిర్వహణ కారణంగా కోవిడ్ సోకి విద్యార్థికి నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో ప్రవేశాల పేరుతో కళాశాలల చుట్టూ తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆన్‌లైన్ ప్రక్రియ చేపట్టామన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం ఇంటర్ బోర్డు నోటిఫికేషన్‌ను కోట్టేసింది. గతంలో మాదిరిగానే ప్రవేశాలు జరపాలని బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
CM KCR: హస్తిన పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీ.. మరికాసేపట్లో కేంద్ర జల్‌శక్తి మంత్రితో భేటీ..!