AP Heatwave Alert: వామ్మో.. ఏపీలో భానుడి భగభగలు.. ఆ మండలాల్లో తీవ్ర వడగాల్పులు..!

Andhra Pradesh Heatwave Alert: శుక్రవారం నాడు ఏపీలోని రెండు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముంది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండలో తిరగడం నివారించాలని, ఎండదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

AP Heatwave Alert: వామ్మో.. ఏపీలో భానుడి భగభగలు.. ఆ మండలాల్లో తీవ్ర వడగాల్పులు..!
Andhra Pradesh Heatwave Alert

Updated on: Mar 06, 2025 | 7:41 PM

ఏపీలో కొన్ని మండలాల్లో శుక్రవారం (07-03-25)నాడు తీవ్ర వడగాల్పులు, వడగాల్పులు వీచే అవకాశముంది. ఆ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ గురువారంనాడు వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పుల(మొత్తం 2 మండలాలు) ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే శుక్రవారంనాడు ఏపీలో 84 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపారు.

వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (84):

శ్రీకాకుళం జిల్లా 9, విజయనగరం 13, పార్వతీపురం మన్యం 11, అల్లూరి సీతారామరాజు 9, అనకాపల్లి 1, కాకినాడ 4, తూర్పుగోదావరి 8, పశ్చిమగోదావరి 1, ఏలూరు 8, కృష్ణా 7, గుంటూరు 8, బాపట్ల జిల్లాలోని 5 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుంది. అలాగే శనివారం నాడు (08 మార్చి 2025) 80 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..

గురువారంనాడు ఇలా..

ఇవాళ గురువారం(మార్చి 06) అనకాపల్లి జిల్లా నాతవరంలో 39.9°C, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో 39.9°C, చిత్తూరు జిల్లా సింధురాజపురంలో 39.7°C, నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 39.5°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. గురువారం 7 మండలాల్లో తీవ్ర, 68 మండలాల్లో వడగాల్పులు వీచాయని అన్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.