AP Health Secretary Anil Kumar Singhal Comments: ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ నివారణ, ప్రజలకు అందించే వైద్య సౌకర్యాల్లో లోటుపాట్లు ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఏపీ ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. సోమవారం కోవిడ్ నియంత్రణ, ఇతర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీసినట్లు సింఘాల్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 71,758 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 2,224 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 322 ఆసుపత్రుల్లో కోవిడ్ పేషంట్స్‌కు చికిత్స జరుగుతుందని అనిల్ సింఘాల్ వివరించారు. పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా దిగివచ్చిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 75 శాతంకు పైగా బెడ్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా పూర్తిగా అందుబాటులో ఉన్నాయన్నారు. అక్సిజన్ సప్లై అందక మృతి చెందారన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆక్సిజన్‌పై తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చి ప్రజలను, అధికారుల మనోధైర్యం దెబ్బతీస్తున్నారని సింఘాల్ ఆవేదన వ్యక్తం చేశారు. కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాలలో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉందని.. రాష్ట్రంలో జాతీయ సగటు కంటే అధికంగా రికవరీ రేటు ఉందని తెలిపారు.
రాష్ట్రంలో మొత్తంగా 15,004 గ్రామ వార్డ్ సచివాలయాల్లో 5,515 గ్రామాల్లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదని తెలిపారు. కేవలం ఒక్క కేసు ఉన్న సచివాలయాలు 3,110 ఉండగా, రెండు కేసులు ఉన్న సచివాలయాలు 1,891 ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 676 మండలాలకు గానూ 10 కంటే తక్కువ కేసులు ఉన్న మండలాలు 105 ఉన్నాయని సింఘాల్ వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇప్పుడు 10 శాతం కంటే తక్కువ కేసులు ఉన్నాయన్నారు. 8 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. 5 శాతం కంటే ఎక్కువ గా ఐదు జిల్లాలు ఉన్నట్లు సింఘాల్ వెల్లడించారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాలో 5 శాతం కంటే తక్కువకు పడిపోయాయన్నారు. అయితే, ఇదే క్రమంలో కరోనా నియంత్రణలో భాగంగా 8 జిల్లాల్లో ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని సింఘాల్ పేర్కొన్నారు. మిగిలిన 5 జిల్లాల్లో ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు కర్ఫ్యూ ఉంటుందన్నారు.
ఇదిలావుంటే, రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ రికార్డులో కొనసాగుతుందన్న సింఘాల్.. ఇప్పటివరకు 1.26 కోట్ల వ్యాక్సిన్లు కేంద్రం ఇచ్చింది. 21.5 లక్షల డోసులు ఏపీ కొనుగోలు చేసింది. ఇక, దేశవ్యాప్తంగా రికవరీ రేటు సగటు 96.59శాతం, ఏపీలో 96.67శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. 104కు కూడా కాల్స్ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,148 బ్లాక్ ఫంగస్ కేసులండగా.. వీరిలో 1,095 మందికి సర్జరీలు జరిగాయని.. 237 మంది మృతి చెందగా.. 1,398 మంది డిశ్చార్జ్ అయ్యారని మిగిలిన వారికి చికిత్స జరుగుతుందని వివరించారు.