అమరావతి, అక్టోబర్ 31: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియామకమయ్యారు. ఈ మేరకు ఏపీ సర్కార్ 24 మంది సభ్యులతో కూడిని నూతన టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేసింది. తితిదే ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎన్డీయే కూటమి నేతలకు ధన్యవాదాలు తెలిపారు. తాను కూడా తిరుమలలోనే పుట్టి పెరిగానని, అక్కడి విషయాలన్నీ తనకు క్షుణ్ణంగా తెలుసని అన్నారు. అందుకే తన బాధ్యత మరింత పెరిగిందని ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానించారు. తిరుమలలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, వాటిపై సీఎం చంద్రబాబుతో చర్చించానన్నారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరోసారి ఆయనతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. తిరుమల భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి వంటి తదితర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పాలకమండలి ఆమోదంతో పూర్తి చేయాలన్నదే తన ఆశయమన్నారు. ఈ బాధ్యత తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.
జనసేన కోటాలో ముగ్గురికి టీటీడీ పాలకమండలిలో చోటు దక్కింది. జనసేనా తెలంగాణ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి,ఆర్ట్ డైరెక్టర్ ఆనంద సాయి, జన సేన ట్రెజరర్ ఏ ఎం రత్నం సతీమణి రంగశ్రీ.. టీటీడీ పాలకమండలిలో స్థానం దక్కించుకున్నారు. గతంలో పాలకమండలి సభ్యులుగా వున్న ప్రశాంతి రెడ్డి, జంగా కృష్ణమూర్తి, సుచిత్రా ఎల్లాకు మరోసారి అవకాశం లభించింది. వీరిలో కృష్ణమూర్తి వైద్యనాధన్ వరుసగా ఆరోవసారి టిటిడి పాలకమండలి సభ్యుడిగా ఎంపికై రికార్డు సృష్టించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడుకు, బోర్డు సభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రతను, ఔన్నత్యాన్ని మరింతగా పెంచేలా నూతనంగా నియమితులైన ఛైర్మన్, బోర్డు సభ్యులు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.