అమరావతి, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు దసరా సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఊర్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా సందర్బంగా ప్రధాన నగరాలకు వెళ్లేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. ప్రతీయేట దసరా వచ్చిందంటే స్కూల్స్, కాలేజీలకు భారీగానే సెలవులు వస్తాయి. ఈ ఏడాది రాష్ట్రంలోని పాఠశాలలకు 10 రోజులు సెలవులు వచ్చాయి. విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 13వ తేదీతో సెలవులు ముగుస్తాయి. తిరిగి పాఠశాలలు అక్టోబర్ 14వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సెలవు వస్తుంది. అక్టోబర్ 3వ తేదీన వర్కింగ్ డే. అక్టోబర్ 3వ తేదీన కూడా సర్కార్ సెలవు ఇస్తే.. 12 రోజుల పాటు సెలవులు వస్తాయి. సెలవుల నేపథ్యంలో అక్టోబర్ నెలలో కేవలం 17 రోజులు మాత్రమే తరగతులు జరగనున్నాయి. అయితే దసరా సెలవులపై ఏపీ సర్కార్ ఇంకా అధికారిక ప్రకటన వెలువరించ లేదు. ప్రకటన వస్తేగానీ మొత్తం ఎన్ని రోజులు సెలవులు వస్తాయనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు అక్టోబర్ నెలలోనే 31వ తేదీన దీపావళి ఉండటంతో ఆ రోజు రాష్ట్రంలోని అన్ని స్కూల్స్, కాలేజీలకు సెలవు వస్తుంది. ఇలా మొత్తంగా చూస్తే అక్టోబర్ నెలలో మొత్తం 13 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఇక క్రిస్మస్ సెలవులు డిసెంబరు 22 నుంచి 29 వరకు ఇవ్వనున్నారు. సంకాంత్రి సెలవులు 2025 జనవరి 10 నుంచి 19 వరకు ఉంటాయి.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులపై ప్రకటన వెలువరించింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలకు వరుసగా 13 రోజులు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీన తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ ప్రకటనలో వివరించింది. ఆ తర్వాత డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్ సెలవులు, జనవరి 13 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు వస్తాయి.