
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ పంపిణీలో అనేక మార్పులు చేస్తోంది. కీలక సంస్కరణలను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో రేషన్ పంపిణీ వ్యవస్థలో చంద్రబాబు సర్కార్ మరో కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. రేషన్ దుకాణాల ద్వారా సరుకులను ప్రభుత్వం సబ్సిడీపై తక్కువ ధరలకు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే రేషన్ సరుకులు తీసుకున్నప్పుడు పేమెంట్స్ చేసేందుకు CBDC డిజిటల్ రూపాయి విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటగా విజయవాడ, విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి డిజిటల్ వాలెట్ అందించనున్నారు. దీంతో ఇక నుంచి బయోమెట్రిక్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. సబ్సిడీ అనేది డైరెక్ట్‌గా డిజిటల్ రూపాయిగా జమ కానుంది. దీంతో రేషన్ షాపుల్లో ఈ-పేమెంట్స్ చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీని వల్ల వేగవంతమైన లావాదేవీలు చేయవచ్చు. అటు మధ్యాహ్న భోజన పథకానికి స్టీమ్ బియ్యం కూడా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా రేషన్ సరుకుల పంపిణీ విధానంలో ప్రభుత్వం అనేక మార్పులు చేసింది. అటు త్వరలో ఏపీ ప్రభుత్వం మినీ స్టోర్స్ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు సిద్దమవుతోంది. వీటి ద్వారా తక్కువ ధరకు నాణ్యమైన సరుకులను ప్రజలకు అందించనుంది. మిల్లెట్స్ కూడా ఈ స్టోర్స్ ద్వారా అందించనున్నారు. తొలుత రాష్ట్రంలో వెయ్యికిపైగా మినీ స్టోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇటీవల ప్రకటించారు.
ఇప్పటికే రేషన్ కార్డుదారులకు క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త స్మార్ట్ కార్టులను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేసింది. అలాగే గతంలో ఇంటికే రేషన్ డోర్ డెలివరీ చేసే వాహనాలు ఉండగా.. ఇప్పుడు వాటిని తొలగించింది. కేవలం 60 ఏళ్లు దాటిన వృద్దులకు మాత్రమే ఇంటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు. డీలర్లు నేరుగా ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు. ఇక మిగతావారు నేరుగా రేషన్ దుకాణానికి వెళ్లి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ నెలలో 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ అందిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పంపిణీ చేస్తున్నారు. బియ్యంతో పాటు పంచదార, రాగులు, జొన్నలు వంటివి పంపిణీ చేస్తున్నారు. త్వరలో గోధుమలు, కందిపప్పు కూడా పంపిణీ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. గతంలో కొన్ని జిల్లాల్లో గోధుమలు, కందిపప్పు పంపిణీ చేయగా.. ప్రస్తుతం స్టాక్ లేకవపోడం వల్ల నిలిపివేశారు.