
ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కిడ్నీ రోగులకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయం తీసుకుంది. కిడ్నీ రోగులు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పట్టణాలు, సిటీలోని ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం జర్నీ ఖర్చులతో పాటు ఆస్పత్రుల ఖర్చులు బోల్డెంత అవుతాయి. కిడ్నీ రోగులకు ఇది భారంతో కూడుకున్న పని. ఇక సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద ఆర్దిక భారమని చెప్పవచ్చు. దీంతో కిడ్నీ రోగులకు భారీ ఊరట కలిగించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కొత్తగా డయాలసిస్ కేంద్రాలను ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 డయాలసిస్ కేంద్రాలను కొత్తగా త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు సత్యకుమార్ యాదవ్ తాజాగా ప్రకటించారు. వీటిని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ అధ్వర్యంలో కొన్ని డయాలసిస్ కేంద్రాలు నడుస్తుండగా.. వీటితో కలిపి మొత్తం 25 కేంద్రాలు సేవలు అందిస్తాయని చెప్పారు. దీని వల్ల సామాన్యులు ఉచితంగా డయాలసిస్ సేవలు పొందవచ్చని, ముఖ్యంగా మారుమూల గ్రామాల్లోని కిడ్నీ రోగులకు ఉపయోగపడతాయని తెలిపారు. సెకండరీ హాస్పిటల్స్‌లో వీటిని ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం చర్యలు ప్రారంభించినట్లు స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న వాటిల్లో రెండు కేంద్రాలను గిరిజన ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. త్వరలోనే ఈ రెండు నెలకొల్పుతామని, మిగతా 11 కేంద్రాలు ఏప్రిల్ నాటికి ప్రారంభిస్తామన్నారు.
ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రొగ్రామ్ క్రింది వీటిని ఏర్పాటు చేయనున్నట్లు సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఇప్పటికే నిధులు మంజూరు అయ్యాయన్నారు. ప్రస్తుతం ఇవి టెండర్ దశలో ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి, కొండపి, నంద్యాల జిల్లాలోని సున్నిపెంట, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, కడప జిల్లాలోని జమ్మలమడుగు, మైదుకూరు, చిత్తూరు జిల్లాలోని పీలేరు, నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేట, విజయనగరం జిల్లాలోని ఎస్.కోట, తిరుపతి జిల్లాలోని రైల్వేకొండూరు, తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు, ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు కానున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేల నుంచి వచ్చిన వినతులతో స్పందించి ఈ కేంద్రాలను మంజూరు చేసినట్లు చెప్పారు. రూ.11.03 కోట్లు ఖర్చు పెట్టి వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ప్రతీ కేంద్రంలో రూ.85 లక్షల విలువ చేసే పరికరాలు ఉంటాయన్నారు. కూటమి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చాక కొత్తగా ఇప్పటికే 12 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.