Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరోసారి అవకాశం.. ఫిబ్రవరి 10 వరకే ఛాన్స్.. ఆఫ్‌లైన్‌లో కూడా..

ఏపీలో ఇంటింటి సర్వేను ప్రభుత్వం గత కొంతకాలంగా చేపడుతోంది. జనవరి 13తో ఈ సర్వే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ పలు సమస్యల వల్ల ఆలస్యమవుతోంది. ముఖ్యంగా గ్రామాల్లో సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయడం కష్టంగా మారింది.

Andhra Pradesh: ఏపీ ప్రజలకు మరోసారి అవకాశం..  ఫిబ్రవరి 10 వరకే ఛాన్స్.. ఆఫ్‌లైన్‌లో కూడా..
Ap Family Survey

Updated on: Jan 26, 2026 | 2:54 PM

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ నెలలో చేపట్టిన ఏకీకృత కుటుంబ సమగ్ర సర్వే గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబ సర్వే చేపట్టారు. ఈ సర్వేలో ప్రతీ కుటుంబసభ్యుడి వివరాలు, ఆర్ధిక వివరాలు నమోదు చేసుకున్నారు. దీని ద్వారా సంక్షేమ పథకాలు అర్హులైనవారికి అందిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వేలో పలు వివరాలు తప్పుగా నమోదయ్యాయి. దీంతో కొంతమంది ప్రభుత్వ పథకాలకు అర్హత పొందలేకపోతున్నారు. దీనిని గమనించిన కూటమి ప్రభుత్వం.. తప్పులను సరిదిద్దేందుకు కుటుంబ సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టింది. గత ఏడాది డిసెంబర్‌ నెలలో ఈ సర్వే ప్రారంభించింది.

ఫిబ్రవరి 10 వరకు పొడిగింపు

డిసెంబర్‌లో సర్వే మొదలవ్వగా.. 30 రోజుల పాటు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 12 వరకు ఈ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ముగిసినా సర్వే ఇంకా పూర్తి కాలేదు. టెక్నికల్ కారణాల వల్ల సర్వే ఆలస్యమవుతోంది. దీంతో గడువును ఫిబ్రవరి 10 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సర్వే ద్వారా ఏపీలోని ప్రతీ కుటుంబం వివరాలు నమోదు చేయనున్నారు. ఆన్‌లైన్ విధానంలో ఈ సర్వే చేపడుతుండగా.. గ్రామాల్లో ఫోన్ సిగ్నల్స్ ఉండకపోవడం, ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉండటం వల్ల వివరాలు నమోదు చేయడంలో జాప్యం జరుగుతోంది. దీంతో సర్వేలో వివరాలు నమోదు చేయడం కష్టమవుతుందని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ సమగ్ర కుటుంబ సర్వేలో ఇంటింటికి వెళ్లి 20 రకాల అంశాలపై సమాచారం సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్కొ కుటుంబం వివరాల నమోదుకు గంటకుపైగా సమయం పడుతోంది.

టెక్నికల్ సమస్య వల్ల ఇబ్బందులు

ఆన్‌లైన్‌లో కుటుంబ వివరాలు నమోదు చేసేందుకు మధ్యలో టెక్నికల్ సమస్య వస్తే.. అప్పటివరకు నమోదు చేసిన వివరాలు అన్నీ పోతున్నాయి. దీంతో మళ్లీ మొదటి నుంచి వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. దీని వల్ల మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ కారణం వల్లనే సర్వేలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే ఈ సమస్య గురించి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆఫ్‌లైన్‌లో ఈ సర్వే చేపడితే బాగుంటుందని సూచిస్తున్నారు. దీని వల్ల సిగ్నలింగ్ సమస్య ఉండదని, సర్వే వేగంగా పూర్తవుతుందని అంటున్నారు. ఈమేరకు గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్‌ను సచివాలయ ఉద్యోగులు కోరగా.. ఈ సర్వేను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. త్వరలోనే దీనిపై సానుకూల నిర్ణయం బయటకు వచ్చే అవకాశహుంది.