ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపు అధికార-విపక్షాల మధ్య అగ్గి రాజేసింది. టీడీపీ-వైసీపీ మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి. విద్యుత్ చార్జీల పెంపునకు కారణం మీరంటే మీరంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. తాము అధికారంలోకి వస్తే ఐదేళ్ల వరకు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది కూడా గడవక ముందే మాటతప్పిందన్నారు వైసీపీ నేతలు. నవంబర్ 1 నుంచి విద్యుత్ చార్జీలు పెంచుతుందని ఆరోపించారు. ప్రజలపై 6వేల కోట్ల భారం మోపుతున్నారన్నారు పేర్నినాని. చంద్రబాబు పట్టనితనం వల్లే డిస్కంలు నష్టపోతున్నాయన్నారు. ఆ భారాన్ని ప్రజలపై మోపాలని చూస్తున్నారని మండిపడ్డారు.
దీపావళి నుంచి సబ్సిడీ గ్యాస్ అందిస్తామని చెప్పి ఆ లోటును విద్యుత్ చార్జీల రూపంలో పూడ్చుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారన్నారు వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై భారం మోపితే సహించేదిలేదంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామన్నారు శివప్రసాద్ రెడ్డి.
విద్యుత్ ఛార్జీలపై వైసీపీ నేతల వ్యాఖ్యలను తిప్పికొట్టారు మంత్రులు. గత ఐదేళ్లలో విద్యుత్ రంగంలో వైఎస్ జగన్ చేసిన పాపాలే ఇప్పుడు రాష్ట్ర ప్రజల పాలిట శాపాలుగా మారాయన్నారు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ . వైసీపీ అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడుతోందన్నారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిందన్నారు. 2023లో వైసీపీ హయాంలో డిస్కంలు పంపిన ప్రతిపాదనల ప్రకారమే ఈఆర్సీ నిర్ణయం ఉంటుందన్నారు. 2023-24 సంవత్సరానికి గాను మరో 11 వేల 826 కోట్ల భారం ప్రజలపై పడుతుందన్నారు.
కేంద్రంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం కుదుర్చుకన్న అడ్డగోలు ఒప్పందాల వల్లే ప్రజలపై భారం పడుతుందని చెబుతున్నారు టీడీపీ నేతలు. అయితే అప్పుడున్న కేంద్రప్రభుత్వమే ఇప్పుడూ ఉందని.. బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ ఆ ఒప్పందాలను ఎందుకు రద్దు చేసుకోవడంలేదని ప్రశ్నిస్తోంది వైసీపీ.. ఇలా ఏపీలో కరెంట్ రాజకీయం వాడీవేడిగా కొనసాగుతోంది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..