ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1998 డీఎస్సీ అభ్యర్థులను ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు. 1998 డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడేమీ పాఠాలు చెప్పగలరని, వారిని చూసి భయపడుతున్నారన్నారు. వారికి మళ్లీ ట్రైనింగ్ ఇస్తామన్నారు. విజయనగరం జిల్లాలోని చీపురపల్లి నియోజకవర్గం ప్లీనరీలో మంత్రి బొత్స ఈ కామెంట్స్ చేశారు. డబ్బు ఇస్తే ఓట్లు వేస్తారని చంద్రబాబు(Chandrababu) భ్రమపడ్డారన్న మంత్రి.. నియోజకవర్గం స్థాయిలో పార్టీ శ్రేణుల్లో మనస్పర్థలున్నాయని, అవి పార్టీకి మంచిది కాదని హితవు పలికారు. ఎప్పటికీ నేనే నాయకుడ్ని అనుకోవడం మంచిదికాదని సూచించారు. అదృష్టం ఉంటే ఎవరైనా నాయకుడు అవ్వొచ్చని చెప్పారు. సంక్షేమ పథకాలందించడంలో గ్రామ స్థాయి నాయకులు లంచాలడిగితే పార్టీకి చెడ్డపేరు వస్తోందన్నారు. కిమిడి నాగార్జున అమ్మగారు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి ఏం అభివృద్ది చేశారో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుకోవడం సమయం వృధా. డిఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడేమి పాఠాలు చెప్పగలరు. 1998 డిఎస్సీ ఉద్యోగులను చూసి భయపడుతున్నాను. వయసులు పెరిగిపోయాయి, ఈ వయసులో వారు విద్యార్థులకు పాఠాలు ఏమి చెప్తారు. ఉద్యోగులకు మళ్లీ ట్రైనింగ్ నిర్వహిస్తాం.
– బొత్స సత్యనారాయణ, ఏపీ విద్యాశాఖ మంత్రి