కూరగాయల వ్యాపారం చేసుకునే వివాహితపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. వ్యాపారం నిమిత్తం నగరానికి వచ్చి, తిరిగి ద్విచక్ర వాహనంపై బుధవారం రాత్రి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఇద్దరు యువకులు అడ్డగించి అగాయిత్యానికి పాల్ప అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఒంగోలులోని కొప్పోలు-ఆలూరు రహదారిపై బుధవారం రాత్రి జరగగా, గురువారం వెలుగు చూసింది.
కొత్తపట్నం మండలం ఆలూరు గ్రామానికి చెందిన వివాహిత (30) ఒంగోలు నగరంలో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించేది. ఈ క్రమంలో బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని 10 గంటల30 నిముషాల ప్రాంతంలో స్కూటీపై ఇంటికి వెళ్తోంది. ఐతే మార్గం మధ్యలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై ఆమెను వెంబడిచారు. కొప్పోలు-గుత్తికొండవారిపాలెం రహదారిపై గుత్తికొండవారిపాలెం దాటిన తర్వాత నిర్మానుష్య ప్రదేశంలో ఆమె వాహనాన్ని ఢీ కొని, చీకట్లో పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఐతే ఇంటి వద్ద ఆమె కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందారు. అనంతరం ఆమెను వెతుక్కుంటూ బయల్దేరగా.. మార్గం మధ్యలో తారసపడగా ఆమెపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసిన సంగతి కుటుంబ సభ్యులకు తెల్పింది. దీంతో నిందితులును వెతుక్కుంటూ బయల్దేరిన బాధితురాలి బంధువులకు కొత్తపట్నం రోడ్డులోని ఓపెట్రోల్‌బంకు సమీపంలో కనిపించారు. వారిని పట్టుకునేలోపు పరారయ్యారు.
ఈ ఘటనపై బాధితురాలు ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని హింసకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ఎస్పీ మలికా గార్గ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ పోలీస్ టీం నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆలూరు రోడ్డు వద్ద ఉన్న రొయ్యల చెరువుల వద్ద పనిచేస్తున్న యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.