Andhra Pradesh: ఇదేంది సారూ.. రెండుసార్లు రూ.లక్షల్లో కరెంట్ బిల్లు.. ఆ తర్వాత ఏ జరిగిందంటే..

| Edited By: Shaik Madar Saheb

Feb 11, 2024 | 1:35 PM

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలు ప్రాంతాల్లో పూరి గుడిసెలకు, బడ్డీ షాపులకు వేలల్లో, లక్షల్లో కరెంటు బిల్లులు వచ్చిన సందర్భాలు ఎన్నో మనం చూసాం.. అయినా సరే ఎప్పటికీ అధికారుల తీరు మాత్రం ఏమాత్రం మారడం లేదు.. రూ.లక్షల్లో బిల్లులు పొందే వారందరూ సామాన్యులే కావడంతో వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరు కారణంగా బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Andhra Pradesh: ఇదేంది సారూ.. రెండుసార్లు రూ.లక్షల్లో కరెంట్ బిల్లు.. ఆ తర్వాత ఏ జరిగిందంటే..
Electricity Bill
Follow us on

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలు ప్రాంతాల్లో పూరి గుడిసెలకు, బడ్డీ షాపులకు వేలల్లో, లక్షల్లో కరెంటు బిల్లులు వచ్చిన సందర్భాలు ఎన్నో మనం చూసాం.. అయినా సరే ఎప్పటికీ అధికారుల తీరు మాత్రం ఏమాత్రం మారడం లేదు.. రూ.లక్షల్లో బిల్లులు పొందే వారందరూ సామాన్యులే కావడంతో వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరు కారణంగా బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాజాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ పేద కుటుంబానికి లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చింది. తప్పిదాన్ని సరి చేయాల్సిన అధికారులు తిరిగి బాధితున్నే డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో వారితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ పక్క కరెంట్ బిల్లు షాక్ మరో పక్క బిల్ కట్టలేదని విద్యుత్ కట్ చేయడంతో అంధకారంలో మగ్గుతున్న బాధితుడు ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామానికి చెందిన పిల్లేం నాగయ్య కూలి పని చేస్తూ జీవనాన్ని గడుపుతున్నాడు. గత ప్రభుత్వ హయాంలో రెండు గదులలో ఓ చిన్నపాటి ఇంటిని నిర్మించుకుని, అందులో ఒక్కడే నివాసం ఉంటున్నాడు. నాగయ్యకు విద్యుత్ మీటర్ యూనిట్లపై ప్రభుత్వ సబ్సిడీ ఉండడంతో గత కొంతకాలంగా విద్యుత్ బిల్లు చెల్లించడం లేదు. అయితే గతనెలలో విద్యుత్ బిల్లు రూ.1.11 లక్షలు వచ్చేసరికి అది చూసిన నాగయ్య షాక్ కి గురయ్యాడు. దాంతో తనకు లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చిందంటూ విద్యుత్ అధికారులను సంప్రదించాడు. అయితే వారు తన సమస్యను తీర్చేందుకు రూ.15 వేలు డబ్బులు డిమాండ్ చేశారని, చివరకు రూ. 10వేలు.. లేక రూ. 5 వేలైన డబ్బులు ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేసినట్లు నాగయ్య ఆరోపించాడు.. తాను అంత ఇచ్చుకోలేనని రూ. 15 వందల నుంచి రూ. 2 వేలు మాత్రమే ఇవ్వగలనని చెప్పినా వినలేదని తెలిపాడు..

చివరకు తాను డబ్బులు ఇవ్వడం లేదని.. విద్యుత్ అధికారులు తాను ఇంటిదగ్గర లేని సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయటమే కాకుండా, స్థంభంపై ఉన్న విద్యుత్ వైర్లను తీసుకుని వెళ్లిపోయారని బాధితుడు ఆరోపించాడు. అయితే విషయం తెలుసుకున్న విద్యుత్ ఉన్నతాధికారులు మీటర్లోని సాంకేతిక లోపం వల్లే లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చిందని, ఆ మీటర్ ను టెస్టింగ్ కూడా పెట్టి, బాధితుడికి వేరే మీటర్ అరేంజ్ చేసి విద్యుత్ సరఫరా ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే బాధితుడు నాగయ్య విద్యుత్ బిల్లులు పరిశీలిస్తే గత సంవత్సరం ఆగస్టులో మొదటిసారిగా నాగయ్యకు లక్షల్లో కరెంట్ బిల్లు వచ్చింది. అయితే అప్పుడే దాన్ని సరి చేయవలసిన విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పటివరకు దాన్ని సరి చేయకుండా బిల్లు కట్టలేదని నెపంతో సరఫరా నిలిపివేయడం పట్ల సర్వత్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులకు విషయం తెలిసి హుటాహుటిన బాధితుడి దగ్గరకు చేరుకుని మీటర్ మార్చి వారి తప్పును సరి చేయడంతో.. ఉన్నతాధికారుల దృష్టికి వెళితేనే కానీ సామాన్యుడిని సమస్యను పరిష్కరించరా అంటూ అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..