AP SIPB Meeting: ఏపీలో పలు పరిశ్రమల ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదముద్ర.. కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకేః సీఎం జగన్

|

Jun 29, 2021 | 8:45 PM

ఆంధ్రప్రదేశ్‌లో పలు పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదముద్ర వేసింది.

AP SIPB Meeting: ఏపీలో పలు పరిశ్రమల ఏర్పాటుకు ఎస్ఐపీబీ ఆమోదముద్ర.. కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకేః సీఎం జగన్
Ap Cm Ys Jagan Sipb Meeting
Follow us on

AP State Investment Promotion Board Meeting: ఆంధ్రప్రదేశ్‌లో పలు పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదముద్ర వేసింది. మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు బోర్డు గ్రీని సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో కొత్త పరిశ్రమ స్థాపనకు మార్గం సుగమం అయ్యింది. కొత్తగా వచ్చే కంపెనీల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్నారు సీఎం జగన్ . పర్యావరణంపై ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

ఏపీలో 7 వేల 500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు జిందాల్ స్టీల్ ఆంధ్ర లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. నెల్లూరు జిల్లా చిల్లకూరు సమీపంలో జిందాల్‌ స్టీల్‌ ఆంధ్ర లిమిటెడ్‌కు 860 ఎకరాలు తక్కువ ధరకు ఇచ్చేందుకు SIPB ఆమోదం తెలిపింది. నాలుగేళ్లలో 2 వేల 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి.

కడప సమీపంలోని కొప్పర్తి వద్ద పిట్టి రెయిల్‌ ఇంజినీరింగ్‌ కాంపొనెంట్స్‌ లిమిటెడ్‌కు అంగీకారం తెలిపారు. ఎలక్ట్రికల్, లోకోమోటివ్, విద్యుత్‌, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలను అక్కడ తయారు చేస్తారు. ఆ పరిశ్రమ వల్ల 2 వేల మందికి నేరుగా ఉద్యోగాలొస్తాయి. 401 కోట్లు పెట్టుబడి పెట్టనుంది పిట్టి సంస్థ. కొప్పర్తి సమీపంలోనే నీల్‌కమల్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు బోర్డు ఓకే చేసింది. నీల్‌కమల్‌కు దేశవ్యాప్తంగా పరిశ్రమలున్నాయి. అన్నిటికంటే పెద్ద పరిశ్రమను 486 కోట్ల పెట్టుబడితో కొప్పర్తిలో ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చింది నీల్‌కమల్‌. ఆ కంపెనీ ద్వారా 2వేలకు పైగా ఉద్యోగాలు రానున్నాయి.

ఇక, నాయుడుపేట సమీపంలో గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణకు బోర్డు ఆమోదం తెలిపింది. ఫోర్డ్, హుందాయ్, ఫోక్స్‌వాగన్‌ తదితర కంపెనీలకు స్టీల్, ఐరన్‌ ఉత్పత్తులు అందిస్తుంది గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ. జపాన్, కొరియాలకు రోబోటిక్‌ టెక్నాలజీతో ఉత్పత్తులు తయారు చేస్తుంది. ప్రస్తుతం గ్రీన్‌టెక్ సంస్థలో 2 వేల 700 మంది పనిచేస్తుండగా, విస్తరణ ద్వారా మరో 2వేల 200 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

చిత్తూరు జిల్లా ఎలకటూరులో అమ్మయప్పర్‌ టెక్స్‌టైల్స్‌ పరిశ్రమకు పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు అంగీకారం తెలిపింది. 30 కోట్ల పెట్టుబడితో 2 వేల 300 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. 90 శాతం మహిళలకే జాబ్స్‌ ఇస్తామని తెలిపింది ఆ సంస్థ. విశాఖపట్నం జిల్లా అచ్చుతాపురంలో నిర్మాణం అవుతున్న సెయింట్‌ గోబైన్‌ పరిశ్రమ ఏర్పాటుకు డెడ్‌లైన్‌ పొడిగించారు. కోవిడ్‌ కారణంగా ఫ్యాక్టరీ నిర్మాణం ఆలస్యమవుతోందని ఆ సంస్థ ప్రభుత్వానికి తెలిపింది.

మరోవైపు.. రిటైల్‌ పాలసీకి సూత్రప్రాయ అంగీకారం తెలిపింది ఏపీ సర్కార్. టెక్స్‌టైల్స్, గార్మెంట్స్‌ మార్కెట్‌ ప్లేస్‌లో భాగంగా మెగా రిటైల్‌ పార్క్‌ నిర్మాణానికి SIPB ఆమోదముద్ర వేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 5 ఎకరాల్లో రిటైల్‌ బిజినెస్‌ పార్క్‌ ఏర్పాటు చేయబోతున్నారు. సుమారు 195 కోట్ల పెట్టుబడితో 900 వరకూ రిటైల్‌ యూనిట్స్‌ అక్కడ స్థాపించాలన్నది ప్లాన్. 5వేల మందికి ప్రత్యక్షంగా.. మరో 20వేల మందికి పరోక్షంగా జాబ్స్‌ వస్తాయని అంచనా వేశారు. జాతీయ, అంతర్జాతీయంగా కొనుగోలు, విక్రయాలకు హబ్‌గా ఈ పార్క్‌ను తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో తయారయ్యే వాటిలో 70శాతం విక్రయాలు ఇక్కడనుంచే జరుగుతాయని.. ఒక్కో స్టోర్‌లో ఏడాదికి 11 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Read Also… CM Jagan : ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకూ కరకట్ట విస్తరణ పనులకు రేపు సీఎం శంకుస్థాపన