AP MLC Elections: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయంలోముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫాం అందజేశారు. ఎమ్మెల్సీ అభ్యర్ధులు పాలవలస విక్రాంత్ (శ్రీకాకుళం), ఇసాక్ బాషా(కర్నూలు), డీసీ గోవిందరెడ్డి(కడప) ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం జగన్ చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థులు సెక్రటేరియట్‌కు వెళ్లి నామిషన్ వేయనున్నారు.
ఎమ్మెల్యే కోటాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన పాలవసల విక్రాంత్.. పాలవలస కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మూడో తరం నాయకుడు. ఈయన తాత పాలవలస సంఘం నాయుడు, నాయనమ్మ రుక్ముణమ్మ ఉణుకూరు ఎమ్మెల్యేలుగా సేవలందించారు. తండ్రి రాజశేఖరం ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, జెడ్పీ చైర్మన్‌గా సేవలందించారు. విక్రాంత్ డీసీసీబీ చైర్మన్‌గా పనిచేశారు.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా ఎంపికైన దేవసాని చిన్న గోవిందరెడ్డి 1988లో గ్రూపు–1లో ఎంపికై రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా పనిచేశారు. డిప్యూటీ కమిషనర్ ట్రాన్స్‌పోర్ట్‌గా పదోన్నతి పొంది 2001లో రాజీనామా చేసి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004లో బద్వేలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014లో జయరాములు, 2019లో డాక్టర్ వెంకట సుబ్బయ్యలను ఎమ్మెల్యేలుగా గెలిపించారు. వెంకటసుబ్బయ్య హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య డాక్టర్ సుధను గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన పార్టీకి చేసిన సేవలను గుర్తించిన వైఎస్ జగన్ 2015లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఆ పదవీ కాలం 2021 మే నెలలో ముగిసింది.
ఇక, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇసాక్‌బాషా మైనార్టీ వర్గ నేతగా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 2018లో వైఎస్సార్‌సీపీ నంద్యాల పట్టణ శాఖ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా, నంద్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీల స్ధానాలకు తమ పేరును ఖరారు చేయడంతో ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఙతలు తెలిపిన డీసీ గోవింద రెడ్డి, పాలవలస విక్రాంత్, ఇషాక్ బాషా.ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పలువురు ఎమ్మెల్యేలు, నేతలు.
Read Also… Nirmala Sitharaman: పెట్రో ధరల భారం తగ్గాలంటే వారిని నిలదీయండి.. నిర్మలా సీతారామన్ సలహా