రాయలసీమ రైతులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సోలార్, విండ్ విద్యుత్ ఉత్పాదన కోసం భూములిచ్చేందుకు అంగీకరించిన రైతులకు ఎకరానికి 30 వేల రూపాయల లీజుని చెల్లిస్తామని ప్రకటించారు. ఆ మేరకు ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుంటుందని వెల్లడించారు. ప్రభుత్వమే ఈ భూములు లీజుకు తీసుకుని కంపెనీలకు ఇస్తుందని వెల్లడించారు. నంద్యాల జిల్లా కలవటాల దగ్గర రామ్‌కో సిమెంట్ పరిశ్రమను ప్రారంభించిన సీఎం రైతులను భూములిచ్చేందుకు ఒప్పించాలని అధికారులకు సూచించారు. సోలార్, విండ్ విద్యుత్ ఉత్పాదనకు రైతులు సహకరించాలని, గ్రీన్‌కో ప్రాజెక్టులకు రైతులు సుముఖంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు. ప్రభుత్వమే రైతుల నుంచి భూమి తీసుకొని విద్యుత్ తయారీ సంస్థలకు ఇస్తుందని, రైతులతో ఒప్పందం చేసుకొని ప్రభుత్వం వార్షిక లీజు కింద 30 వేల రూపాయలు చెల్లిస్తుందని వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి మూడేళ్ళకోసారి లీజుని ఐదు శాతం పెంచుతామని ముఖ్యమంత్రి రైతులకు హామీ ఇచ్చారు.
ఒక ప్రాంతంలో కనీసం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేలా భూములు సేకరించాలన్నారు జగన్. ఈ ప్రతిపాదనకు అంగీకరించిన రైతుల నుంచి భూములను సేకరించాలని, రైతులను ఒప్పించడంతో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని తెలిపారు సీఎం జగన్. కనీసం 2 వేల ఎకరాలు ఓ క్లస్టర్‌గా ఉండాలన్నారు. గ్రీన్ కో ప్రాజెక్ట్‌లకు అన్నదాతలు సహకరించాలన్నారు. ఒక పరిశ్రమ రావడం వల్ల ఆ ప్రాంతం ఎంతో డెవలప్ అవుతుందని ..స్థానిక యువతకు జాబ్స్ వస్తాయన్నారు.
గ్రోత్ రేటులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా ఉందన్నారు సీఎం జగన్. రానున్న 4 ఏళ్లలో 20 వేల జాబ్స్ రాష్ట్రానికి వస్తాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం దూసుకుపోతుందన్నారు. పరిశ్రమలు రాష్ట్రానికి తెచ్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇండస్ట్రీలు వస్తే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందని సీఎం జగన్ చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి