AP Assembly: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) బడ్జెట్ సమావేశాలకు (Budget session) తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 7 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నెలాఖరు వరకు అంటే దాదాపు మూడు వారాల పాటు సమావేశాలు జరుగనున్నాయి. 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సమావేశాల నిర్వహణకు సంబంధించి బీఏసీ సమాశం(BAC Meeting)లో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
సమావేశాల్లో తొలిరోజైన మార్చి 7న ఇటీవల అకాల మరణం చెందిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి మృతిపట్ల అసెంబ్లీలో సంతాపం తెలుపనున్నారు. అనంతరం సభవాయిదా పడనుంది. మార్చి 8న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. మార్చి 11 లేదా 14న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ.2.30లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ఉండే అవకాశముందన్న తెలుస్తోంది. ఇప్పటికే బడ్జెట్ పై అన్ని శాఖల కసరత్తు దాదాపు పూర్తైంది. ఈసారి బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యమివ్వాలని సీఎం వైఎస్ జగన్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే, వ్యవసాయం పాడి పరిశ్రమపై దృష్టిపెడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ సమావేశాల్లో కేవలం బడ్జెట్ పైనే కాకుండా కొన్ని కీలక అంశాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. కొన్ని ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముంది. వీటిలో ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. సమగ్రమైన బిల్లులతో మళ్లీ వస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాల్లోనే కొత్త బిల్లులను తీసుకొస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు, ఓటీఎస్ అంశాలు చర్చకు రానున్నాయి. వీటితో పాటు ఇటీవల రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైన కొత్త జిల్లాల ఏర్పాటు అంశం అసెంబ్లీలో కీలకంగా మారనుంది. కొత్త జిల్లాల నోటిఫికేషన్ పై ప్రతిపక్షాలతో పాటు అధికార పక్షం నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదిలావుంటే, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే విషయంలో టీడీపీ పునరాలోచనలో పడింది. సమావేశాలకు హాజరైతేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తన కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడారనే కారణంగా చంద్రబాబు గత అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. సీఎం అయితేనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు. అప్పట్లో ఆయనతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సమావేశాలను బహిష్కరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7 నుంచి ప్రారంభం కానున్నాయి. గత సమావేశాల్లో చంద్రబాబు చేసిన శపథం, హడావుడి నేపథ్యంలో ఈ సమావేశాలకు వెళ్లాలా వద్దా అనే విషయంపై టీడీపీలో చర్చ జరుగుతోంది. అయితే, తాను అసెంబ్లీకి రానని, ఎమ్మెల్యేలు వెళ్లాలని చంద్రబాబు చెబుతున్నట్లు సమాచారం.
Read Also…. Andhra Pradesh: అర్థరాత్రి దెయ్యం పిలుస్తోందంటూ.. యువకుడి వింత ప్రవర్తన చూడండి