Andhra Pradesh: పర్యాటకుల ప్రాణాలను హరిస్తున్న వాగులు.. అధికారుల అలసత్వమా? పర్యాటకుల నిర్లక్ష్యమా?

మన్యం ప్రాంతంలో విహారయాత్రలు వద్ద అధికారుల నిర్లక్ష్యం వల్ల ముక్కుపచ్చలారని ముగ్గురు విద్యార్ధినులను వాగులు మింగేస్తునాయి. శోకిలేరు వాగులో..

Andhra Pradesh: పర్యాటకుల ప్రాణాలను హరిస్తున్న వాగులు.. అధికారుల అలసత్వమా? పర్యాటకుల నిర్లక్ష్యమా?
Andhra Pradesh Students

Updated on: Sep 28, 2022 | 12:36 PM

మన్యం ప్రాంతంలో విహారయాత్రలు వద్ద అధికారుల నిర్లక్ష్యం వల్ల ముక్కుపచ్చలారని ముగ్గురు విద్యార్ధినులను వాగులు మింగేస్తునాయి. శోకిలేరు వాగులో నిన్న కళ్లముందే తమ స్నేహితురాలు వాగులో కొట్టుకుపోతుండగా, ఆమెను రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు విద్యార్ధినులు వాగులో కొట్టుకుపోయి మృతి చెందారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం చదలవాడ పంచాయతీ పరిధిలోని సోకిలేరు వాగులో ఈ విషాద ఘటన వారి కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చింది.

బాపట్ల జిల్లా వేటపాలేనికి చెందిన అనుజ్ఞ ప్రైవేటు స్కూల్లో పదో తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు విజ్ఞాన యాత్ర నిమిత్తం ఆదివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వచ్చి.. భద్రాచలం మీదుగా అన్నవరానికి వెళ్దాం అనుకున్నారు. మార్గమధ్యంలో చింతూరు మండలంలోని సోకిలేరు వాగు సందర్శనకు వెళ్లారు. అక్కడ ప్రకృతి అందాలను తిలకిస్తూ కొద్దిసేపు ఫొటోలు దిగారు. అయితే కాళ్లు కడుక్కునేందుకు గౌరవి సువర్ణ కమల (15) అనే విద్యార్ధిని ముందుగా వాగులోకి దిగి కాలుజారి పడిపోయింది. నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోతుండగా చేయి అందించి ఆమెను రక్షించేందుకు మరో ఇద్దరు ప్రయత్నించి వాగులో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. తరచూ ఇదే వాగు వద్ద అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ కనీస జాగ్రత్త సూచనలు గానీ, బీట్ పోలీసులు గానీ లేకపోవడం వల్ల చాలామంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే విద్యాశాఖ నుంచి పర్మిషన్ లేకుండానే విద్యార్థులతో విహారయాత్రకి వచ్చినట్లు తెలుస్తోంది.

మన్యం ప్రాంతంలో పాములేరు వాగు, సీతపల్లి వాగు, జడేరు వాగు, పింజర వాగు, జల తరంగిణి వాగుల వద్ద ఎక్కువగా పర్యాటకులతో సందడిగా ఉంటుంది. పంచాయతీ పరిధిలో ఉన్న వ్యూ పాయింట్స్ వద్ద పర్యాటకుల నుంచి టిక్కెట్లు వసూలు చేసి చేతులు దులుపుకుంటున్నారు సిబ్బంది. ఇక ఆ వాగు అందాలను చూస్తు పర్యాటకులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సెల్ఫీల మోజులో పడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు వద్ద జారిపడి కుటుంబాలకు శోకాన్ని మిగులుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వాగుల వద్ద సెల్ఫీలు మోజులో పడి ఇన్‌స్టాగ్రమ్, ఫేస్‌బుక్, రీల్స్‌లో ఫొటోస్ పెట్టాలని ఆత్రుతతో.. మరింత ఉధృతంగా వస్తున్న వాగు మధ్యలో ఉన్న బండరాళ్లు పైకెళ్ళి ఫోటోలు దిగుతున్నారు యువత. ఇలాంటి స్పాట్లను గుర్తించి పోలీసులు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లలపై అవగాహన ఉండి ఇలాంటి విహారయాత్రకి వెళ్ళినప్పుడు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..