Andhra News: పెళ్లి గురించి పేరెంట్స్ మధ్య చర్చ.. అది విని కూతురి చేసిన పనికి అంతా షాక్
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకే యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజగా ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. పెళ్లి చేస్తారన్న భయంతో ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. చేతికొచ్చిన కూతురి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

అనంతపురం జిల్లాలోని గార్లదిన్నె మండలంలో ఒక హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వివాహం చేస్తారేమోనన్న భయంతో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రూపకీర్తన(17) ఇటీవలే ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తి చేసింది. ప్రస్తుతం వేసవి సెలవుల కావడంతో ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో, అమ్మాయికి మంచి సంబంధం వస్తే పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు తమలో తాము చర్చించుకున్నారు. అయితే, ఈ విషయంలో రూపకీర్తన తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు కేవలం చర్చించుకున్నప్పటికీ, వారు ఎక్కడ తనకు పెళ్లి చేసేస్తారోనని మనస్తాపానికి గురైంది.
ఈ భయంతోనే ఈనెల 6వ తేదీన పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఇంటర్ విద్యార్థిని రూపకీర్తనను ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రూపకీర్తన మృతి చెందింది. చేతికొచ్చిన కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. నిండు నూరెళ్లు బతకాల్సిన విద్యార్థిని అర్థాంతరంగా జీవితాన్ని ముంగించడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటు తల్లిదండ్రులు కూడా తాము పెళ్లి చేస్తామని బలవంతం చేయలేదని… కేవలం ఏదైనా మంచి సంబంధం వస్తే పెళ్లి చేద్దామని ఆలోచిస్తుండగా.. కుమార్తె తొందరపడి కఠిన నిర్ణయం తీసుకుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
