
ఆయన ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యే .. నిత్యం మీటింగ్‌లు, సభలు, పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటారు. అలాంటి ఎమ్మెల్యేకు కాస్త తీరిక దొరకడంతో స్టైల్ మార్చారు. సతీమణితో కలిసి స్టెప్పులేశారు. ఆయనే విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్. రాజకీయ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపే ఆయన తాజాగా జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. చిరంజీవి నటించిన ‘కొండవీటి దొంగ’ సినిమాలోని ‘శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో’ అనే పాటకు కాలు కదిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
నిన్న మంత్రి.. నేడు ఎమ్మెల్యే..
తన మావయ్య కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్న అమర్నాథ్ దంపతులు స్టైలిష్‌గా ముస్తాబయ్యారు. అనంతరం నిర్వహించిన సంగీత్ కార్యక్రమంలో ఇలా సరదాగా డ్యాన్స్ చేశారు. కాగా ఇటీవల ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఇలాగే హుషారుగా డ్యాన్స్ చేశారు. హైదరాబాద్ వేదికగా జరిగిన తన కూతురు పెళ్లిలో నితిన్ ‘సై ‘ సినిమాలోని ‘నల్ల నల్లాని కళ్ల’ పాటకు ఉత్సాహంగా కాలు కదిపారు. ఈ వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది.