Amit Shah: నేడు విశాఖలో పర్యటించనున్న అమిత్ షా.. ఆపై భారీ బహిరంగ సభలో ప్రసంగం.. ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్..

|

Jun 11, 2023 | 6:54 AM

Amit Shah Vizag Tour: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ స్పీడ్‌ పెంచుతోంది. వరుస బహిరంగ సభలతో హీట్‌ పుట్టిస్తోంది. నిన్న శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా పర్యటించగా.. ఇవాళ విశాఖకు రాబోతున్నారు అమిత్‌షా. రెండు రోజుల్లో ఇద్దరు బీజేపీ అగ్ర నేతలు పర్యటిస్తుండటంతో ఏపీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

Amit Shah: నేడు విశాఖలో పర్యటించనున్న అమిత్ షా.. ఆపై భారీ బహిరంగ సభలో ప్రసంగం.. ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్..
Union Home Minister Amit Shah
Follow us on

Amit Shah Vizag Tour: ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుంది ఏపీలో బీజేపీ పరిస్థితి. కొద్దిరోజులుగా ఏపీపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది బీజేపీ. దానిలో భాగంగా.. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్ర నేతలతో రెండు బహిరంగ సభలు ఏర్పాటు చేసింది. ముందుగా బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా శనివారం శ్రీకాళహస్తిలో పర్యటించారు. బీజేపీ మహాసంపర్క్‌ అభియాన్‌ సభలో పాల్గొన్న ఆయన.. మోదీ తొమ్మిదేళ్ల పాలనను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయి.. స్కామ్‌లు నడుస్తాయని మండిపడ్డారు. అభివృద్ధితో మోదీ దేశాన్ని పరుగులు పెట్టిస్తుంటే.. వైసీపీ సర్కార్‌ అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు జేపీ నడ్డా.

ఇదిలావుంటే.. ఇవాళ ఏపీలో పర్యటించనున్నారు బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. విశాఖ వేదికగా జరగనున్న బీజేపీ మహాజన సంపర్క్‌ అభియాన్ సభలో పాల్గొననున్నారు. రాత్రి 7 గంటలకు పోర్టు గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 8 గంటలకు సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు అమిత్‌షా. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు. అయితే.. విశాఖ సభలో అమిత్‌ షా ఏం మాట్లాడతారన్నది ఆసక్తిగా మారింది. శ్రీకాళహస్తి సభలో పాల్గొన్న జేపీ నడ్డా.. జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దాంతో.. అమిత్‌ షా ప్రసంగంపైనా అంచనాలు పెరుగుతున్నాయి. విశాఖ సభలో నడ్డా ప్రసంగానికి కొనసాగింపుగా అమిత్‌షా స్పీచ్‌ ఉంటుందా?.. అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

వాస్తవానికి.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు మాత్రం ముందుగానే అలెర్ట్‌ అయ్యాయి. ఈ క్రమంలో.. పొత్తులపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించగా, టీడీపీ, జనసేన పొత్తులు దిశగా ముందుకు వెళ్తున్నాయి. సీట్ల వ్యవహారం సర్దుబాటు అయిన తర్వాత అధికారికంగా పొత్తుల వ్యవహారాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అంతేకాదు.. బీజేపీ కూడా కలిసి వచ్చేలా టీడీపీ, జనసేన ప్రయత్నాలు సాగిస్తున్నాయి. దానికి తగ్గట్లుగానే.. కొద్దిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అమిత్‌ షా, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పొత్తులు గురించి చర్చించినట్లు ప్రచారం జరిగినా.. క్లారిటీ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే.. ఏపీలో బీజేపీ అగ్రనేతలు పర్యటిస్తుండటంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందా అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. విశాఖ సభలో అమిత్‌ షా ఏం మాట్లాడతారో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..