
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. చంద్రబాబును దూషించిన కేసులో టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా 126(2),196,352,351 (2),292 రెడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద కేసు ఫైలయింది. ఇక విధులకు ఆటంకం కల్గించారని నల్లపాడు ఎస్సై కృష్ణమోహన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అంబటిపై 126(2),132 BNS సెక్షన్ల కింద మరో కేసు నమోదయింది. అరెస్ట్‌కు ముందు అరెస్ట్ తరువాత కూడా అంబటి ఇంటి దగ్గర హైటెన్షన్ నెలకొంది. అంబటి ఆఫీసులోకి దూసుకెళ్లిన ఆందోళన కారులు అక్కడున్న కార్లను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.
అంబటిని అరెస్ట్ చేసి తరలిస్తుండగా దాడికి యత్నించారు,వజ్రవాహనంపై రాళ్లు కోడిగుడ్లు విసిరారు. అంబటి ఆఫీసుకు అగ్గి పెట్టే ప్రయత్నం చేశారు, ఫ్లెక్సీలకు నిప్పు అంటించి అంబటి ఆఫీసులోకి విసిరేశారు. అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పేశారు. అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తనతో పాటు 60మందిని పోలీసులు నిర్బంధించారని పిటిషనల్‌లో పేర్కొన్నారు.
రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరొపించారు. అంబటి రాంబాబుపై టీడీపీ వర్గీయుల దాడిని ఖండించారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు ఆదేశాలతోనే దాడులు జరిగాయని ట్వీట్ చేశారు.
దాడులను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. వైసీపీ నేతలకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖను కోరారు జగన్. . దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నం, దాడులు చేస్తారా? అని టీడీపీని ప్రశ్నించారు,ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయన్నారు. ఏపీ జంగిల్ రాజ్‌లా మారిపోయిందన్నారు వైఎస్ జగన్.గవర్నర్ స్పందించి వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ ఆటవిక రాజ్యాంగం నడుస్దుందన్నారు వైసీపీ నేత,మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అంబటిపై దాడి చేశారన్నారు. అప్పుడు వంగవీటి మోహనరంగాను హత్య చేశారు ఇప్పుడు అదే తరహాలో అంబటిపై హత్యాయత్నం చేశారన్నారు. చర్యకు ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు అమర్నాథ్. గుంటూరులో అర్ధరాత్రి వరకు ఆందోళనలు అట్టుడికాయి.అంబటిని అరెస్ట్ చేసి నల్లపాడు పీఎస్‌కు తరలించిన తరువాత కూడా హైటెన్షన్ కొనసాగుతూనే ఉంది. అంబటికి ప్రాణహాని వుంది.. ఆయనకు ఆయన కుటుంబానికి భద్రత కల్పించాలి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి డీజీపీకి లేఖ రాశారు.