మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షుల విచారణను సిబిఐ ప్రారంభించింది..కొన్నిరోజులుగా సీబీఐ అధికారులు పులివెందులలో ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే నిన్న (మంగళవారం) సీబీఐ విచారణకు వివేకా కుమార్తె సునీత హాజరయ్యారు. కాగా, (బుధవారం)ఇవాళ సీబీఐ ముందు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. ఈయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడపలో సీబీఐ విచారణకు హాజరయ్యారు.
గత 12 రోజులుగా పులివెందుల, కడప వేదికగా సీబీఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఏడు గంటల పాటు, వైఎస్ సునీత రెడ్డిని సీబీఐ విచారణ చేసింది. ఆమె నుంచి చాలా వివరాలు రాబట్టినట్టు సమాచారం. అంతకు ముందు రెండు రోజుల పాటు వైఎస్ వివేక, ఇంటికి వాచ్ మెన్ గా ఉన్న వ్యక్తిని కూడా సీబీఐ విచారించింది. కాగా, వివేకా కుమార్తె సునీత ఈ కేసులో హైకోర్టుకు సమర్పించిన 15 మంది అనుమానితుల జాబితాలో శివశంకర్ రెడ్డి పేరు కూడా ఉన్నట్లు సమాచారం. హత్య జరిగిన రోజున ఘటనా స్థలిలో వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు శంకర్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే, ఆయన సాక్ష్యాలు తారుమారు చేయడానికి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో శివశంకర్ రెడ్డిని కూడా 5 రోజుల పాటు ప్రత్యేక దర్యాప్తు సంస్థ అధికారులు విచారించారు. కానీ, సిట్ అధికారులు ఈ కేసును ఛేదించలేకపోయారు.
ఈ క్రమంలోనే..ఈ ప్రభుత్వం చేసే విచారణ పై తమకు నమ్మకం లేదు, ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. ఏకంగా వైఎస్ జగన్ సోదరి, వైఎస్ సునీత హైకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే.. అనుమానితులుగా, వైఎస్ కుటుంబంలో కొంత మందిని చేర్చి, హైకోర్టులో పిటీషన్ వేసిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. తరువాత హైకోర్టు విచారణ జరిపి, ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తూ..నిర్ణయం తీసుకుంది.