విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్..తెలుగు ప్రజల ఆత్మగౌరవ సూచికగా స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని ఘోర పరాభవాన్ని గత ఎన్నికల్లో మూటగట్టుకుంది. ఆ తర్వాత నుంచి నేతలు వన్ బై వన్..బీజేపీ, వైసీపీ కండువా కప్పుకుంటున్నారు. మరోవైపు పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరవేస్తున్నారు. అంతేకాదు..లోకేశ్ ఉంటే పార్టీ బ్రతకడం కష్టమంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ.. జయంతికి, వర్థంతికి తేడా తెలియని వాళ్లు పార్టీని నడిపిస్తే అందులో ఉండాలా అంటూ కామెంట్స్ చేశారు. పనిలో పనిగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ను ఎన్నికల కోసం వాడుకుని వదిలేసిందని, లోకేశ్ పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఎన్టీఆర్‌ను తొక్కేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ కామెంట్స్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైరయ్యారు. ఆస్తులు కాపాడుకోవడం కోసమే.. నేతలు పార్టీలు మారుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఇష్యూపై కూడా స్పందించిన లోకేశ్.. ఎప్పుడో 2009 విషయం గురించి ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. అటువంటి విభేదాలు ఏమి లేవు, టీడీపీకి..ఎన్టీఆర్ ఎప్పుడు అవసరమే అని చెప్పాల్సింది పోయి..లోకేశ్ ఇలా మాట్లాడటం ఏంటని చాలా మంది అతని సొంతపార్టీ నేతలే చర్చించుకుంటున్నారట.
అయితే ఇక్కడే అసలు ప్రశ్న ఎదురయ్యింది. టీడీపీకి ఇప్పుడు దిక్సూచి లాంటి నేత అవసరం. క్యాడర్‌లో జోష్ నింపే మాస్ లీడర్ కావాలి. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే భరోసా వారికి ఇవ్వాలి. అలాంటి లీడర్ జూనియర్ ఎన్టీఆరే అంటూ చాలా మంది టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అతడు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రాకపోయినా.. పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయితే… క్యాడర్ చెక్కుచెదరకుండా ఉంటుందని కొంతమంది సీనియర్ నేతలు చంద్రబాబుకు సూచనలిచ్చారట. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టిన పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ ‘మాకు ఏ లీడర్ అక్కర్లేదని..ఎన్టీఆర్ కంటే చంద్రబాబే స్ట్రాంగ్ లీడర్’ అంటూ పేర్కొన్నారు. తాజాగా.. టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబు, యంగ్ టైగర్‌ను ప్రోత్సహించడానికి సంసిద్ధంగా లేరని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.