గుంటూరు, సెప్టెంబర్ 9: ఇటీవల గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధి పాము కాటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో తాజాగా ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. పాము కాటు వేసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా కాలయాపన చేయడం వల్లనే ఎంఏ విద్యార్ధి మృతి చెందినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సెప్టెంబర్ 7వ తేదీన మయన్మర్‌కి చెందిన కొండన్న (38) అనే బుద్ధిజం విద్యార్ధి రాత్రి 10.30 గంటల సమయంలో క్యాంపస్‌లో పుట్టగొడుగుల సేకరణ కోసం చెట్ల పొదల్లోకి వెళ్లాడు. అయితే అక్కడ ఓ పుట్ట వద్ద పుట్టగొడుగులు సేకరిస్తుండగా రక్త పింజరి పాము కొండన్నను కాటు వేసింది. అతడితోపాటు మరో విద్యార్ధి కూడా ఉన్నారు. పాము కాటేసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లకుండా ఆ ఇద్దరూ పాము కోసం వెతకడం ప్రారంభించారు. అయితే మయన్మార్‌లో ఎవరైనా పాము కాటు వేస్తే, దానిని చంపి దాంతో పాటే ఆసుపత్రికి వెళుతారట. అంతేకాకుండా ఆ పాము జాతిని బట్టి వైద్యం అందిస్తారట.
దీంతో సంఘటన జరిగిన రోజున కొండన్న, అతడి స్నేహితుడు కాటు వేసిన పాము కోసం వెతకడం ప్రారంభించారు. ఈ రోజు రాత్రి 10.30 గంటలకు రక్తపింజరి పాము కరిచింది. వీళ్లు దాదాపు 2 గంటల వరకు అంటే 12 గంటల వరకు దాని కోసం వెతికారు. చివరికి ఆ పాము దొరకడంతో దానిని చంపి, దాంతో పాటు ఇద్దరూ మంగళగిరిలోని ఓ ఎన్నారై ఆసుపత్రికి వెళ్లారు. అయితే అప్పటికే ఆలస్యమైంది. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినా.. అప్పటికే విషయం శరీరమంతా వ్యాపించడంతో కాసేపటికే కొండన్న ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడు కొండన్న మయన్మార్‌లోని క్యూహా బుద్ధిజం యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ చదివాడు. ఉన్నత విద్య కోసం గుంటూరు నాగార్జున యూనివర్సిటీకి గత నెలలో వచ్చాడు. సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. అయితే మయన్మార్ నుంచి భారత్‌కు వచ్చిన ఆ విద్యార్థి అర్ధాంతరంగా మృతి చెందడంతో వర్సిటీలో విషాద ఛాయలు అలముకున్నాయి. విద్యార్ధి మృతిపై వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సింహాచలం వ్యాఖ్యలు మరోలా ఉన్నాయి. కొండన్నను వర్సిటీ బయట కాలువ గట్టున పాము కాటేసిందని పేర్కొనడం గమనార్హం. దీనిపై దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.