అమరావతిలో అక్రమ మద్యం..! ఇలా కూడా తరలించేస్తున్నారు..?

సరిహద్దు రాష్ట్రాల నుంచి ఏపీలోకి భారీగా మద్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. ప్రభుత్వం పకడ్బంది నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపడుతున్నప్పటికీ అక్రమార్కులు మాత్రం అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు.

అమరావతిలో అక్రమ మద్యం..! ఇలా కూడా తరలించేస్తున్నారు..?

Updated on: Sep 05, 2020 | 5:11 PM

సరిహద్దు రాష్ట్రాల నుంచి ఏపీలోకి భారీగా మద్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. ప్రభుత్వం పకడ్బంది నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపడుతున్నప్పటికీ అక్రమార్కులు మాత్రం అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే గ్యాస్ సిలిండర్‌లో, ఒంటి చుట్టూ బాటిళ్లు కట్టుకుని, ఇంకా అనేక రూపాల్లో మద్యం తరలిస్తూ పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా కొరియర్ , పార్సిల్ సర్వీసుల ద్వారా భారీగా అక్రమ లిక్కర్ దందా జరుగుతున్నట్టు గుర్తించారు ఏపీ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసులు.

అమరావతి మండలం మునగోడులో భారీగా మద్యం పట్టుబడింది. ఇంటి వాటర్‌ ట్యాంకులో దాచిన 10 వేల తెలంగాణ మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం దాచిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం అ‍మ్మకాలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ కొందరు అక్రమంగా రాష్ట్రాల సరిహద్దులు దాటి సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది వ్యాపారులు ఏకంగా కొరియర్‌ సెంటర్లను కేంద్రంగా చేసుకుని అక్రమ మద్యం దందా చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయించి సొమ్ము చేసుకుంటున్న‌ట్లు ఎఈబీ అధికారులు తేల్చారు.

ఇదిలా ఉంటే, అటు అనంతపురంలో మద్యం అక్రమ రవాణా కోసం కొంతమంది ఎవరూ ఊహించని మార్గం ఎంచుకున్నారు. ఏపీలో కావాల్సిన మద్యం దొరకడం లేదంటూ..కొంత మంది మద్యం ప్రియులు కర్నాటక నుంచి ఏపీకి మద్యం తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. స్మగ్లర్లు ఈసారి కొత్త ప్లానేశారు. టెట్రా ప్యాక్‌లలో మద్యం నింపి..ఎవరికీ అనుమానం రాకుండా బోర్డర్‌ దాటించాలని ప్లానేశారు. కానీ ఖాకీల కళ్లుకప్పలేకపోయారు. పట్టుబడ్డ ఈ ముఠా నుంచి 2500 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆటోను సీజ్‌ చేశారు.