శుక్రవారం చేపట్టే మహిళల పాదయాత్రకు ఎలాంటి అనుమతి లేదంటూ గుంటూరు ఎస్పీ విజయరావు తెలిపారు. ఉద్దండరాయునిపాలెం నుండి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు జేఎసీ ఆధ్వర్యంలో మహిళలు పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్‌తో పాటుగా.. సెక్షన్ 30 అమల్లో ఉన్నాయని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పర్మిషన్ లేకుండా ర్యాలీలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అనుమతి లేని ర్యాలీలో ఎవరు పాల్గొన్నా.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇక అటు విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావు కూడా మరో ప్రకటన విడుదల చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బందరు రోడ్డులో ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బెజవాడలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. బందరు రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుందని.. ఈ మార్గం గుండా.. వైద్య,విద్య,వ్యాపార అవసరాల కోసం ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారన్నారు. అంతేకాదు.. ఈ రోడ్డుకు ఆనుకుని ప్లైఓవర్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయని.. ర్యాలీ చేపడితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని.. సాధారణ జన జీవనానికి ఇబ్బంది కలగకుండా చేసే ప్రజా ఉద్యమాలకు పోలీస్ శాఖ సహకరిస్తుందని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగే నిరసనలు చేపటడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.