ఏపీలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మూసివేస్తున్నట్టు వస్తున్న వార్తలపై మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు. తాము వాటిని మూసివేయాలనుకోవడం లేదని, అసలు తమకు అలాంటి ఆలోచనే లేదన్నారు. త్వరలోనే కొన్ని మార్పులు చేసి రాయితీతో అన్నార్తులకు ఆహారాన్ని అందించనున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే చూస్తూ రాద్దాంతం చేస్తున్నాయని బొత్స విమర్శించారు.
గత ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా వీటిని ఏర్పాటు చేసిందని, దీనివల్ల సరైన ప్రయోజనం చేకూరడం లేదని తెలిపారు మంత్రి బొత్స. ఆహారాన్ని అందించిన సంస్ధకు రూ.40 కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు ఉండిపోయాయని, కనీసం నిర్వహణ ఖర్చును కూడా గత ప్రభుత్వం విడుదల చేయలేదని విమర్శించారు. ప్రజల ప్రయోజనం కోసం రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవసరమో వాటిని మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తామని.. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు మానుకుంటే మంచిదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.