వరద వస్తుందనే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని ఎమ్మెల్యే ఆర్కే ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందని.. అందుకే ఫర్నీచర్, కారు తరలించారని ఆయన విమర్శించారు. బాబు ఇంట్లోకి వరద నీరు రావడంతో ఇసుక బస్తాలు వేసి అడ్డుకడ్డ వేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఉండేది ప్రభుత్వ స్థలంలోనని అందుకే ఆయన భద్రత బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని ఆర్కే స్పష్టం చేశారు.
వరద సహాయక చర్యలను చేపడుతున్న అధికారులను అడ్డుకోవడం సరికాదని ఆర్కే హితవు పలికారు. వరదలను కూడా టీడీపీ రాజకీయం చేస్తోందని.. ప్రభుత్వ యంత్రాంగం అంతా వరదపై సమీక్షలు చేస్తుంటే టీడీపీ నేతలు మాత్రం తమ ప్రభుత్వంపై బురద జల్లటం తగదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దేవినేని వ్యాఖ్యలపై కూడా ఆయన ఫైర్ అయ్యారు. వరదలు వస్తే కరకట్ట మునిగిపోతుంది అని గతంలో బోటుపై దేవినేని ఉమా తిరిగింది నిజం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇక ‘‘హై సెక్యురిటి జోన్ అనేది నీ ఇంటికి వర్తిస్తుందని.. నువ్వు సొంతంగా ఇల్లు కట్టుకుంటే అపుడు డ్రోన్స్ వస్తే మాట్లాడు. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఇల్లు కొరకు అప్లై చేసుకో మా ప్రభుత్వం ఉగాది రోజున ఇల్లు ఇస్తాం’’ అని ఆర్కే ఘాటుగా స్పందించారు.