ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. తన చుట్టూ చిక్కుకున్న కేసులు, గృహ సంబంధ గొడవలు.. ఆయనను ఆత్మహత్యకు ప్రేరేపించాయని తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించి.. పలు సార్లు.. మంత్రిగా.. నవ్యాంధ్ర స్పీకర్‌గా సేవలు అందించిన ఆయన.. రాజకీయ జీవనం అర్థాంతరంగా ముగిసింది.
1947 మే 2న గుంటూరు జిల్లా నకరికల్ మండలం కండ్లగుంట గ్రామంలో సంజీవయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులకు కోడెల జన్మించారు. విజయవాడ లయోలా కళాశాలలో పియూసీ చదివారు. బాల్యంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో మరణించడంతో.. డాక్టర్ కావాలని నిర్ణయించుకున్న ఆయన.. తాత ప్రోత్సాహంతో.. మెడిసిన్ చదవారు. కర్నూలు వైద్య కళాశాలలో చేరి.. రెండన్నర సంవత్సరాల తరువాత తిరిగి గుంటూరుకు మారారు. వారణాసిలో ఎంస్ చదివారు. నర్సారావుపేటలో ఆస్పత్రిని ఏర్పాటు చేసి వైద్య వృత్తికి అంకితమయ్యారు. అనతి కాలంలోనే మంచి డాక్టర్‌గా పేరుపొందారు. పల్నాడులో అంచెలంచెలుగా ఎదిగి.. రాజకీయ జీవనాన్ని ప్రారంభించారు.
కాగా.. తనపై గత ఫర్నీచర్ కేసుతో పాటు తన కుటుంబసభ్యులపై నమోదైన కేసులు కూడా.. కోడెలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినట్టు తెలుస్తోంది. ఫర్నీచర్ కేసు(సెక్షన్ 409, 411 కింద కేసు నమోదు), కోడెల కుమారుడి షోరూమ్ లైసెన్స్ రద్దు, ఆయన కుమారుడు, కుమార్తె ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని మోసం చేశారని.. నమోదైన కేసులు, కుమార్తె విజయలక్ష్మిపై 15 కేసులు నమోదు.. ఇలా మూకుమ్మడి కేసులు కోడెలను తీవ్రంగా కృంగదీసినట్లు తెలుస్తోంది.