ఏపీలో పురపోరుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి అన్ని ప్రధాన పార్టీలు. సార్వత్రిక ఎన్నికలను తలపించే రీతిలో పార్టీలు తమ కార్యకలాపాలు చేపడుతున్నాయి. జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియకు ఇవాళ్టి (బుధవారం)తో తెరపడబోతోంది. ఇక రేపటి నుంచే ఆయా పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించనున్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలన్న ఎలక్షన్ అధికారుల ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే అనుమానిత ప్రాంతాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది.
ప్రచార కార్యక్రమాల సందర్భంగా ఆయా పార్టీల కార్యకర్తలు విచ్చలవిడిగా ప్రవర్తించడానికి అవకాశాలు ఉన్నట్లు అనుమానించిన పోలీసులు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. డబ్బు, మద్యాన్ని పంచడాన్ని ప్రభుత్వం నిషేధించిన ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి కార్యకలాపాలపైన ప్రత్యేక నిఘా ఉంచారు. ఎన్నికల ప్రచార నియమావళికి నిక్కచ్చిగా అమలు చేయడంపై దృష్టి సారించింది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలపై నిఘా ఉంచింది. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే నాయకులను గానీ, కార్యకర్తలను గానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది పోలీసు శాఖ.
ఎన్నికల సిబ్బంది నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి లేకుండా ఇంటి మీద పార్టీ జెండా ఎగురవేసినా, ఎన్నికల గుర్తును అమర్చినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమతులు లేకుండా పార్టీ జెండాలను, ఎన్నికల గుర్తులను అమర్చే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఒక్కసారి ఎన్నికల సమయంలో కేసు నమోదైతే.. ఇక జీవితాంతం కూడా ఎన్నికలు జరిగిన ప్రతీసారీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంటుందని వెల్లడిస్తున్నారు.