కాకినాడకు.. అమరావతికి లింకేంటి..? కాకినాడలో భవనం కుంగిపోతే.. అందరి దృష్టి అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా మీదికి ఎందుకు మళ్లుతోంది..? ఈ సింపుల్ ప్రశ్నలపై కాస్త లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమయ్యేది నదీ పరివాహక ప్రాంతంలో ఉండే చవుడు భూముల్లో నిర్మించే భవనాలే గుర్తొస్తాయి.
తాజాగా కాకినాడలో మూడంతస్తుల భవనం ఉన్నట్లుండి భూమిలోకి కుంగిపోయింది. 13 ఏళ్ల క్రితం ఈ భవనాన్ని నిర్మించారు. ఇందులో మొత్తం 40 ఫ్లాట్లు ఉన్నాయి. కాగా, ముందుగానే అపార్ట్‌మెంట్ కూలిపోతుందని భావించిన భవనం వాసులు ఖాళీ చేశారు. దీంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇక, ఈ భవనం కూలిన పరిస్థితి గమనిస్తే.. రాజధాని అమరావతి నిర్మాణం పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలే గుర్తుకువస్తాయి. కృష్ణానదికి వరద వచ్చినప్పుడు కూడా కూడా ఇదే అంశం పై చర్చ జరిగింది. అమరావతి కోర్ క్యాపిటల్ నిర్మాణ ప్రాంతానికి కూడా ఇదే తరహా ముప్పు ఉందన్న వైసీపీ నాయకుల వాదన మరోసారి తెర మీదికొచ్చింది. వరద ముంపుకు గురయ్యే ప్రాంతమని.. రాజధానిని వేరే ప్రాంతానికి మార్చాలని, అలా కాకుండా ఇదే ప్రాంతంలోని చవుడు భూముల్లో రాజధాని భవనాలను నిర్మిస్తే అవి కుంగిపోక తప్పదని బొత్స లాంటి అనుమానాలు వ్యక్తం చేశారు. కుంగిపోకుండా నిర్మించాలంటే దాదాపు మూడు రెట్లు అధికంగా నిర్మాణ వ్యయాన్ని భరించాల్సి వస్తుందని.. తద్వారా ప్రజాధనం వృధా అవుతుందని బొత్స అప్పట్లో వాదించారు. కొద్ది రోజుల క్రితం వరకూ దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేగింది. నేతలు ఎవరికి అనిపించిన విధంగా వారు మాట్లాడారు. కాని సీఎం జగన్ మాత్రం రాజధాని అంశం పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజాగా కాకినాడలో భవనం కుంగిపోతుండటంతో అమరావతి భూముల్లో భవనాలు నిర్మిస్తే కూడా ఇదే గతా.. అన్న అనుమానాలు మొదలయ్యాయి. కాకినాడ భవనాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. క్యాపిటల్ విషయంలో తమ వాదనను సమర్థించుకుంటున్నారు వైసీపీ నాయకులు.
ఈ నేపథ్యంలో కోర్ క్యాపిటల్ నిర్మాణ ప్రాంతాన్ని ప్రభుత్వం మరోసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని వైసీపీ నాయకులు సూచిస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది అసక్తిగా మారింది.