గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ క్షతగాత్రులు ఒక్కొక్కరూ ఆ భయానక క్షణాలను తలచుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. బోటులో అత్యధికులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన సీహెచ్ జానకి రామారావు ప్రమాద సమయంలో శవాసనం వేసి ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు.
ఆయన ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయం అందరం బ్రేక్‌ఫాస్ట్ చేసి కూర్చున్నామని, మరికొద్ది సేపట్లో పాపికొండలు ప్రారంభమవుతాయని బోటులో ప్రకటన ఇచ్చారని, అదే సమయంలో ఇది డేంజర్ జోన్ కావడంతో బోటు అటు ఇటు ఊగుతుందని.. ఎవ్వరూ భయపడవద్దని ముందే చెప్పారని రామారావు చెప్పారు. అయితే అలా చెప్పిన కొద్ది సేపటికే బోటు ఒక్కసారిగ ఒక వైపునకు ఒరిగిపోయిందని.. అప్పటి వరకు బోటులో ఉన్న కుర్చీల్లో కూర్చున్న వారంతా ఒకవైపునకు వచ్చేశారని, దీంతో బోటు మరోవైపునుకు ఒరిగిందన్నారు. ఇదిలా ఉంటే మొదటి అంతస్తులో ఉన్న వారంతా రెండో అంతస్తుకు వెళ్లే ప్రయత్నాలు చేశారని, తాను శవాసనం వేసి తన ప్రాణాలు దక్కించుకున్నానని జానకి రామారావు చెప్పారు. తన కుటుంబంతో కలిసి విహార యాత్రకు వెళ్లామని.. ఈ ప్రమాదంలో తన బావమరిది భార్య, వారి కుమారుడు కనిపించడం లేదని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. హైదరాబాద్‌కు దగ్గర్లోని మేడిపల్లి శ్రీనివాసరావుకు చెందిన రామారావు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఇదిలా ఉంటే హైదరాబాద్ హయత్‌నగర్‌కు చెందిన విశాల్, ధరణీకుమర్,అర్జున్, లడ్డూ ఈ దుర్ఘటనలో గల్లంతయ్యారు.