అయ్యప్ప మాల… గోవిందమాల …శివమాల….. భవాని మాల ఇవన్నీ భక్తులు ప్రతి సంవత్సరం ఆయా సీజన్లలో ఆయా దేవుళ్ళ కు సంబంధించిన మాలధారణ చేస్తుంటారు. కానీ అక్కడ మాత్రం తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు …తాత, ముత్తాతలు అయిన పితృదేవతల మాలను ధరించడం గత కొన్ని ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. మహాలయ పక్షాల లో పితృదేవతల మాల ధారణ చేసి ప్రతినిత్యం పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించడం శాస్త్రోక్తంగా జరుగుతోంది. దక్షిణ కాశీ భూలోక వైకుంఠం..మధ్య కైలసంగా సుప్రసిద్ధి గాంచిన పుష్పగిరిలో గురువారం పుజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పుష్పగిరి క్షేత్రం ఎంతో చారిత్రాత్మక మైన మహిమాన్వితమైనది. ఇక్కడ వెలిసిన శైవ వైష్ణవ క్షేత్రాలు వాటి చారిత్రాత్మక నేపథ్యం మరెంతో ఘనమైనది. ఉత్తర భారతదేశంలో లో కాశీ, వారణాసి, గయ వంటి క్షేత్రాల అంతటి చరిత్ర ప్రాశస్తం కలిగి ఉంది. ఈ క్రమంలో పుష్పగిరి లోని రుద్ర పాదం వద్ద పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే ఆ పితృదేవతలకు స్వర్గ లోక ప్రాప్తి కలగడంతో పాటు, ఎవరైతే పితృదేవతా దీక్ష స్వీకరిస్తారో వారికి పితృదేవతల ఆశీర్వాదంతో పాటు సకల శుభాలు కలుగుతాయని నమ్మకం.
కడప జిల్లా పల్లూరు మండలంలో కుందు.. పెన్నా… పాపాగ్ని… వల్కల పట్టి పంచనది సంగమం పినాకినీ నదీ తీరాన ఈ పుష్పగిరి క్షేత్రం ఉంది. పుష్పగిరిలోని రుద్రపాదం వద్ద పితృదేవతలకు పిండప్రదానం చేస్తే ఆ పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి కలగడంతో పాటుగా, ఎవరైతే పితృదేవతా దీక్ష స్వీకరిస్తారో వారికి పితృదేవతల ఆశీర్వాదంతో పాటుగా సకల శుభాలు కలుగుతాయిని ఇక్కడి వారి నమ్మకం. ఈ క్రమంలోనే మహాలయ పక్షాల సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పరిసర జిల్లాలోని చాలామంది గతించిన తమ పెద్దల ను స్మరిస్తూ పితృ దేవతల దీక్షలు స్వీకరించి రుద్ర పాద ముద్ర పిండప్రదానాలు చేశారు. ఇక్కడ దీక్షలు తీసుకుని క్రతువులు నిర్వహిస్తే కాశీ గయా వారణాసి లాంటి ప్రాంతాల్లో నిర్వహించిన పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు ప్రత్యక్ష దేవతలు తల్లిదండ్రుల ను స్మరించుకుని ఏడాదికోమారు మహాలయ పక్షాల్లో పితృదేవతల మాల ధారణ చేసి వారికి పిండ ప్రదానాలు చేయడం ఎంతో శ్రేయస్కరమని రుద్రపాదం పరిరక్షణ సమితి అధ్యక్షులు సాయినాథ్ శర్మ వెల్లడించారు.